ఏపీ ముఖ్యమంత్రి అమెరికా పర్యటన షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏడు రోజుల అమెరికా పర్యటన నిమిత్తం 15వ తేదీ( గురువారం రాత్రి) హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఈ నెల 22 వరకు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రముఖ వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. ఆగస్టు 16న ఉదయం 8:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలు) వాషింగ్టన్ చేరుకుంటారు. అదే రోజు భారత్‌లో అమెరికా రాయబారితో సమవేశమవుతారు. అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో భేటీ అవుతారు. 17న మధ్యాహ్నం 2 గంటలకు డల్లాస్ చేరుకుంటారు. సాయంత్రం 6 నుంచి 7:30 గంటల వరకు డల్లాస్‌లోని బెయిలీ హచిన్‌సన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉత్తర అమెరికాలోని తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 18వ తేదీన వాషింగ్టన్‌లోని వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి. 19, 20, 21వ తేదీల్లో వ్యక్తిగత కార్యక్రమాలు. 22వ తేదీన షికాగాలో వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖుల్ని కలుస్తారు. అదే రోజు రాత్రి అమెరికా నుంచి బయలుదేరి రాష్ట్రానికి తిరిగి వస్తారు.