ASBL Koncept Ambience

రూ.20 కోట్లతో ఎపి లో డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి

రూ.20 కోట్లతో ఎపి లో డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్‌ లో డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేయడానికి వేల్యూ థాట్‌ ఐటీ సొల్యూషన్స్‌, డల్లాస్‌ లోని యూనివర్సిటీ అఫ్‌ టెక్సాస్‌ తో ఆంధ్రప్రదేశ్‌ డ్రోన్స్‌ కార్పొరేషన్‌ అంగీకార పత్రంపై సంతకాలు చేశాయి. వేల్యూ థాట్‌ ఐటీ సోలుషన్స్‌ తన పరిశోధన, అభివద్ధి కేంద్రాన్ని, డ్రోన్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేసింది. సుమారు 20 కోట్ల రూపాయల పెట్టుబడి కి ముందుకు వస్తూ ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ సంస్థ గ్రూప్‌ డైరెక్టర్‌ మహేష్‌, యూనివర్సిటీ అఫ్‌ టెక్సాస్‌ అసోసియేట్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ ఎమిలీ లిసీ - ఏపీ ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ బాబు అహ్మద్‌ అంగీకార పత్రాలను ఇచ్చిపుచ్చుకున్నారు.

ఈ ఒప్పందంలో భాగంగా సాంకేతిక అభివృద్ధి, శిక్షణ పై ప్రధానంగా దృష్టి పెడతారు. యూనివర్సిటీ అఫ్‌ టెక్సాస్‌ ఆన్‌ లైన్‌ శిక్షణ నిర్వహించే సమన్వయ బాధ్యత నిర్వహిస్తుంది. డ్రోన్‌, అవి తీసే దృశ్యాలు, ఫోటోల తీరు తెన్నులను ఎప్పటికప్పుడు విశ్లేషించి సలహాలివ్వడానికి అంకురా సంస్థలతో కలిసి పని చేస్తుంది. విశ్వవిద్యాలయ స్థాయిలో పరస్పర సహకారం దిశగా ఆంధ్రప్రదేశ్‌ లోని కే.ఎల్‌. యూనివర్సిటీ తో కలిసి పనిచేస్తుంది.

శిక్షణ, సాంకేతికతను అవసరమైన సహకారాన్ని వేల్యూ థాట్‌ ఐటీ సోలుషన్స్‌ సమకూరుస్తుంది. తయారీ కేంద్రం ఏర్పాటు, అందుకు కావలసిన అవసరాలను అందుబాటులోకి తెస్తుంది. ఉద్యోగుల నియామకం, శిక్షణ తరగతుల్లో పాల్గొనే అభ్యర్థుల ఎంపిక, వారికి తగిన బోధనాంశాలను సమకూర్చడం వంటి చర్యలు చేపడుతుంది.

ఆంధ్రప్రదేశ్‌ లో అనేక కార్యక్రమాల పర్యవేక్షణ కు డ్రోన్‌ లను విరివిగా వినియోగిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యంగా వివిధ ప్రాజెక్టుల పనులు, శాంతి భద్రతల పర్యవేక్షణ, పనుల నాణ్యత విశ్లేషణ వంటి వివిధ రకాల అవసరాలకు డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానం రాష్ట్రంలో ఎంతో ఉపకరిస్తుందని ఆయన అన్నారు. ఈ దిశగా ఇంకా సాంకేతికతను అభివృద్ధి చేయడానికి తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి పిలుపు ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌ వల్ల సుమారు 300 మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయి.

 

Tags :