ASBL Koncept Ambience

ఎపి ఎన్నికల్లో వీరి ఓట్లే కీలకం!

ఎపి ఎన్నికల్లో వీరి ఓట్లే కీలకం!

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అధికారం ఎవరికి ఇవ్వాలనే విషయంలో ఏ పార్టీకి చెందని ఓటర్లే కీలకపాత్రను పోషించనున్నారు. ఏ ప్రభుత్వం అధికారం చేపట్టినా తటస్థ ఓటర్లే ఇప్పటికీ కీలకంగా ఉండటం కనిపిస్తుంది. గత నాలుగైదు దఫాలుగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను పరీక్షిస్తే ఈ అంశం స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు హయాంలో తెదేపా తొలిసారిగా ఒంటరిగా పోటీలో దిగుతుండటం ఒక ప్రాధాన్యత కాగా ప్రతి ఎన్నికల్లోనూ గెలుపును నిర్ణయిస్తూ వచ్చిన ఓట్ల శాతం కూడా స్వల్పమే. అధికారం దక్కినా,చేజారినా ఈ ఓట్లే కీలకంగా కావడం విశేషం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అంతకుముందు ప్రభుత్వాల మీద ఉన్న వ్యతిరేకత కారణంగా గెలిచిన పార్టీకి అనుకూల పవనాలుగా మారాయి. ఈ గాలి ప్రతి ఎన్నికలలో పునరావతం అయినప్పటికీ గెలుపులో మాత్రం తటస్థుల ఓటింగే ప్రధాన భూమిక పోషిస్తోంది. అయితే ఈసారి రంగంలో జనసేన పార్టీ కూడా బీఎస్పీ, వామపక్షాలతో కలిసి బరిలోకి దిగుతుండడంతో ఈ తటస్థ ఓటర్లపై ప్రభావం పడనుంది. దీంతో 2019 సార్వత్రిక ఎన్నికలు నువ్వా నేనా అన్న రీతిలో హోరాహోరీగా జరుగనున్నాయి.

1999 ఎన్నికలకు 2004 ఎన్నికల గెలుపులో తటస్థులే కీలకమయ్యారు. 2009 ఎన్నికలకొచ్చేప్పటికి కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే ఒంటిపోరులో నిలవగా తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌, వామపక్షాలు కలిసి పోటీచేశాయి. కొత్తగా ప్రజారాజ్యం పార్టీ ఒంటరిగా బరిలో నిలచింది. దీంతో కాంగ్రెస్‌, తెదేపా ఓట్లలో కొంత శాతాన్ని ప్రజారాజ్యం చీల్చుకోగలిగింది. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 156 సీట్లు రాగా, తెలుగుదేశం పార్టీకి 92 సీట్లు లభించాయి. టీఆర్‌ఎస్‌కు 10, సీపీఐ 4, సీపీఎం 1 స్థానం వంతున గెలుపొందాయి. కాగా, ఈ ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన ప్రజారాజ్యం పార్టీకి కేవలం 18 స్థానాలే లభించాయి. ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 16.22 శాతం ఓటింగ్‌ రాగా, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో 19.85 శాతం ఓటింగ్‌ వచ్చినట్లయింది. అదే కాంగ్రెస్‌ పార్టీకి 36.56 శాతం ఓట్లు రాగా తెలుగుదేశానికి 28.12 శాతం లభించాయి. ఇక్కడ కూడా 8.44 శాతం మేర ఓట్ల శాతం ఇరు పార్టీల మధ్య వ్యత్యాసంగా ఉంది. అయితే, ఈసారికూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తటస్థ ఓట్లు మాత్రమే కీలకమయ్యాయి.

ఇక 2014 ఎన్నికలకొచ్చేప్పటికి రాష్ట్రం విడిపోయింది. ఈసారి కూడా తెదేపా తన పాత మిత్రులైన భాజపాతో కలిసి బరిలోకి దిగింది. అయితే, వైకాపా ఒక్కటే ఒంటరిగా పోటీలో నిలిచింది. అయితే, ఈ ఎన్నికల్లో తెలుగుదేశం ఘనవిజయం సాధించింది. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం జరిగిన ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలు అన్ని పక్షాలకు సవాల్‌గా మారాయి. అవశేష ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 స్థానాలుండగా అప్పటివరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఒక్కసీటు కూడా దక్కకపోవడం గమనార్హం. చంద్రబాబునాయుడు సారథ్యంలోని తెలుగుదేశం, భాజపాతో పొత్తు కుదుర్చుకుని పోటీచేసింది. ఈ కూటిమికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మద్దతు ప్రకటించారు. వైకాపా తరపున ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి తెలుగుదేశం పార్టీ కూటమికి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, భాజపా కూటమికి 106 స్థానాల్లో విజయం సాధించింది. వైకాపా 67 సీట్లతో స్వతంత్రులు 2 స్థానాల్లో గెలుపొందారు. ఓట్లశాతం పరంగా చూస్తే తెదేపా 44.61, వైకాపా 42.40, కాంగ్రెస్‌ 2.77, భాజపా 2.18, స్వతంత్రులు 1.77 శాతంగా ఉన్నాయి. తెదేపా, భాజపా కూటమికి వైకాపాకు మధ్య ఓట్లశాతం కేవలం 2.21 శాతం మాత్రమేఉంది.

జిల్లాల పరంగా చూస్తే...

గత ఎన్నికల్లో గెలుపులో పశ్చిమ గోదావరి జిల్లా కీలక భూమిక పోషించింది. ఇక్కడ మొత్తం 15 స్థానాలుంటే కూటమి అన్నింటినీ గెలుచుకుంది. తెదేపాకు 14, భాజపాకు1 సీటు వంతున లభించాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 స్థానాలకుగానూ తెదేపా 7, వైకాపా 3 గెలుచుకున్నాయి. విజయనగరంలో 9 స్థానాలుంటే తెదేపాకు 6, వైకాపాకు 3 లభించాయి. విశాఖ జిల్లాలోనూ తెదేపా కూటమి తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఇక్కడ మొత్తం 15 సీట్లుంటే 12 సీట్లను కూటమి తన ఖాతాలో వేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 స్థానాలుండగా 14 స్థానాల్లో తెదేపా-భాజపా కూటమి జయకేతనం ఎగురవేసింది. వైకాపా 5 సీట్లకే పరిమితం అయింది. క ష్ణాలో 16, గుంటూరులో 17 సీట్లు ఉన్నాయి. క ష్ణా జిల్లాలో కూటమికి 11 సీట్లు రాగా వైకాపాకు 5 సీట్లు వచ్చాయి. అలాగే గుంటూరులో తెదేపా కూటమికి 12 రాగా వైకాపాకు 5 వచ్చాయి.

ప్రకాశం, నెల్లూరుల్లో

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైకాపా ఆధి క్యం ప్రదర్శించింది. ప్రకాశంలో మొత్తం 12 సీట్లు ఉంటే అందులో తెదేపా 5, వైకాపాకు 6 దక్కాయి. చీరాల్లో నవోదయం పార్టీ విజయం సాధించింది. నెల్లూరు జిల్లాలో 10 స్థానాలుంటే వైకాపా 7, తెదేపా 3 స్థానాలు గెలుపొందాయి.

రాయలసీమలో

రాయలసీమలోని అనంతపురం జిల్లాలో మొత్తం 14కుగానూ తెదేపాకు 12, వైకాపాకు 2 లభించాయి. వైయస్సార్‌ కడపలో వైకాపా భారీ విజయాన్ని నమోదుచేసింది. ఇక్కడ 10 స్థానాలకు ఏకంగా 9 స్థానాల్లో వైకాపా క్లీన్‌ స్వీప్‌ చేసింది. తెదేపా ఒకేఒక్క స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలుండగా వైకాపా 10, తెదేపా 4 స్థానాలు దక్కించుకున్నాయి. చిత్తూరు జిల్లాలో 14 సీట్లు ఉండగా తెదేపా 6, వైకాపా 8 స్థానాలు గెలుపొందాయి.

 

Tags :