ASBL Koncept Ambience

విశాఖలో పెట్టుబడులకు ఆహ్వానం: సీఎం జగన్‌

విశాఖలో పెట్టుబడులకు ఆహ్వానం: సీఎం జగన్‌

ఢిల్లీలో ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు సన్నాహక సమావేశం జయప్రదం ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో మార్చి నెలలో నిర్వహించనున్న ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సును పురస్కరించుకుని న్యూ ఢిల్లీలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్యతో పాటు పలువురు అధికారుల బృందం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఏపీ అడ్వాంటేజ్‌ అనే థీమ్‌తో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సందర్భంగా ఇన్వెస్టర్లకు వివరించారు.

ఏపీలో పెట్టుబడులు పెట్టిన వాళ్లందరికీ కృతజ్ఞతలని, పరిశ్రమలకు స్థాపనకు ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం అందించేందుకైనా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మా వంతు సహకారం అందిస్తాం. ప్రపంచ వేదికపై ఏపీని నిలబెట్టడానికి మీ సహకారం మాకు అవసరమని చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ గత మూడేళ్లుగా నెంబర్‌ వన్‌గా ఉంటోందని సీఎం జగన్‌ తెలియజేశారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను ఆయన ఇన్వెస్టర్లకు తెలియజేశారు. పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తోనే మేం నెంబర్‌ వన్‌గా ఉన్నాం. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. 11.43 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతోంది.

దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 11 ఇండస్ట్రీయల్‌ కారిడార్‌లో.. మూడు ఏపీకే రావడం శుభపరిణామం. సింగిల్‌ డెస్క్‌ సిస్టమ్‌ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో విశాఖ పాలనా రాజధానిగా మారబోతోందని, తాను కూడా అక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. విశాఖ రాజధానిలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్న సీఎం జగన్‌.. మీతో పాటు ఇతర కంపెనీల ప్రతినిధులను కూడా తీసుకొచ్చి ఏపీలో అభివృద్ధిని చూపించాలని ఇన్వెస్టర్లను కోరారు.

అలాగే రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణం, బలమైన పారిశ్రామిక, లాజిస్టిక్స్‌ మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు తదితర అంశాలను వివరిస్తారు. అలాగే ప్రభుత్వం తరఫున అందించే ప్రోత్సాహకాలు, ప్రత్యేక రాయితీలు తదితర అంశాలను కూడా ఆయన తెలియజేశారు. వివిధ దేశాల దౌత్యవేత్తలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కూడా ఆయన పాల్గొని మాట్లాడారు. దౌత్యవేత్తలను తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా చూడాలని కోరారు.

ఏపీ అడ్వాంటేజ్‌.. ఈ ఏడాది మార్చి 3,4 తేదీల్లో విశాఖలో ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్ట్మెంట్‌ సమ్మిట్‌ జరగనుంది. ఈ గ్లోబల్‌ సమ్మిట్‌లో, బిజినెస్‌-టు-బిజినెస్‌, బిజినెస్‌-టు-గవర్నమెంట్‌ సమావేశాలు, కీలక ప్రసంగాలు, సెక్టార్‌-నిర్దిష్ట దేశ-నిర్దిష్ట ప్లీనరీ సెషన్లను నిర్వహించనున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం ఫోకస్‌ చేసిన 13 కేంద్రీకృత రంగాలపై సెక్టోరల్‌ సెషన్‌లను ప్లాన్‌ నిర్వహించనున్నారు. ఇందులో వివిధ రంగాల పారిశ్రామిక నిపుణులు తమ అనుభవాలను పంచుకొనున్నారు. ఈ అంతర్జాతీయ పెట్టుబడుదారుల సదస్సును విజయవంతం చేసేందుకు వీలుగా దేశంలోని ముఖ్య నగరాలలో వివిధ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా తొలుత న్యూఢల్లీిలో కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌ కు 28 మంది విదేశీ పెట్టుబడిదారులు, 44 దేశాలకు చెందిన రాయబారులను ఆహ్వానించారు. ఈ కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌తో పాటు ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా,ముంబై నగరాల్లో రోడ్డు షోలను కూడా ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది.

 

Click here for Photogallery

 

 

 

Tags :