వైజాగ్ లో మార్చి 3,4 తేదీల్లో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖపట్టణంలో మార్చి 3,4 తేదీల్లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) 2023కు ఏర్పాట్లు అంతా పూర్తయ్యాయి. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే పారిశ్రామిక దిగ్గజాలతోపాటు, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు వైజాగ్‌కు వచ్చేందుకు సిద్ధం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేసింది. పలు రాష్ట్రాల్లో రోడ్ షోలను ఇప్పటికే నిర్వహించి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించింది. ముఖ్యమంత్రి వైయస్‌జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా పలు దేశాల రాయబారులతో రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించి పెట్టుబడిదారులకు ఏపి ఎంత అనుకూలమో వివరించారు.
అభివృద్ధి-పెట్టుబడుల అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను బహిరంగ వేదికగా తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో వైజాగ్ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మార్చి 3,4 తేదీల్లో జరిగే ఈ సమ్మిట్ విజయవంతానికి ఇప్పటికే అవసరమైన కార్యాచరణను మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, బుగ్గన రాజేంద్ర ప్రసాద్ పూర్తి చేశారు.
ఈ గ్లోబల్ సమ్మిట్‌లో బిజినెస్-టు బిజినెస్, బిజినెస్-టు గవర్నమెంట్ సమావేశాలు, కీలక ప్రసంగాలు, సెక్టార్-నిర్దిష్ట, దేశ-నిర్దిష్ట ప్లీనరీ సెషన్లను నిర్వహించనున్నారు. అడ్వాంటేజ్ ఆంధ్రా అనే పేరుతో దీనిని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవిదేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు, ఇన్వెస్టర్లు హాజరుకానున్నారు. ప్రభుత్వం ఈ రెండు రోజుల సదస్సు ద్వారా ఏపీ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేలా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.
గడిచిన మూడేళ్ల కాలంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈడీఓబీ)లో రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది. 11.43 శాతం వృద్ధి రేటు-తో మిగతా రాష్ట్రాల కంటే మిన్నగా ఉంది. పెట్టుబడులు రాబట్టటంలో ఏపీ 5వ స్థానంలో నిలిచింది. అటు- సంక్షేమాన్ని కొనసాగిస్తూ, ఇటు పెట్టుబడుల ఆకర్షణకు ప్రాధాన్యత ఇస్తోంది. పారిశ్రామికవేత్త లకు తాను, తన ప్రభుత్వం కేవలం ఫోన్ కాల్ దూరంలో ఉన్నామని ముఖ్యమంత్రి జగన్ తెలియ జేసేందుకు అందుకు అనుగుణమైన నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. రాజకీయ సుస్థిరతతో పాటు- బలమైన పాలన కూడా పెట్టుబడిదారులకు అందిస్తున్నామని ఆయన ఈ పెట్టుబడిదారుల సమావేశం ద్వారా ఆయన చాటిచెప్పబోతున్నారు. గత కొంతకాలంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, వరుసగా మూడు సంవత్సరాల నుండి పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం విజయం సాధించిన సంగతిని ఆయన గుర్తుచేస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు అందించిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే ఈ ర్యాంకింగ్స్ ఉన్నాయన్న సంగతిని గుర్తుచేస్తున్నారు.
ఏపీలో పెట్టుబడులు ఎంతోలాభం...
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)2023 ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే లాభాల గురించి రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పిస్తోంది. ఇందుకోసం అడ్వాంటేజ్ ఏపీ పేరుతో ప్రత్యేకంగా వెబ్‌సైట్ ఏర్పాటు చేయడమే కాకుండా దేశ వ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో సన్నాహక సదస్సులు నిర్వహించింది. రాష్ట్రంలో ఉన్న వసతులు, పెట్టుబడులు పెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ఇన్వెస్టర్లకు వివరించింది. ఏకంగా 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతంతో పాటు.. సహజ వనరులను వినియోగించుకోవడం ద్వారా నిర్వహణ వ్యయం ఏ విధంగా తగ్గనుందన్న విషయాన్ని జీఐఎస్‌లో ప్రధానంగా వివరించనుంది. మలేషియా, సింగపూర్ వంటి తూర్పు దేశాలకు ముఖ ద్వారంగా ఆంధ్రప్రదేశ్ అత్యంత సమీపంగా ఉండటంతో తీర ప్రాంత వ్యాపార అభివృద్ధికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక ప్రాజెక్టులను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విశాఖలో మేజర్ పోర్టుతో పాటు గంగవరం పోర్టు, కాకినాడ పోర్టు, కాకినాడ యాంకరేజ్ పోర్టు, రవ్వ క్యాపిటివ్ పోర్టు, కృష్ణపట్నం పోర్టుతో కలిపి మొత్తం ఆరు పోర్టులు నిర్వహణలో ఉన్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా సుమారు రూ.30,000 కోట్లతో మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోంది. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా పోర్టుల నిర్మాణం చేపట్టగా, కాకినాడ గేట్‌వే పోర్టు పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మరో పోర్టు నిర్మాణం చేపడుతోంది. ఈ పోర్టులను జాతీయ రహదారులు, రైల్వే ల్కెన్లతో అనుసంధానం చేయడమే కాకుండా పోర్టు సమీపంలోనే పరిశ్రమలు ఏర్పాటయ్యేలా పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది.
ఆరు ఎయిర్‌పోర్టులు.. గన్నవరం, విశాఖ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతిలకు అదనంగా భోగాపురం, రామాయపట్నం ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి పూనుకుంది. తద్వారా వేగంగా ఎగుమతులు, దిగుమతులతో పాటు లాజిస్టిక్ వ్యయాలు భారీగా తగ్గనున్నాయి.
మరోవైపు పరిశ్రమలకు కావాల్సిన భూములను అత్యంత చౌకగా తాము అందిస్తున్నట్లు ప్రభుత్వం వివరిస్తోంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోలిస్తే అత్యంత చౌకగా వేలాది ఎకరాల భూములు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ-చెన్న్కె పారిశ్రామిక కారిడార్, చెన్న్కె-బెంగళూరు, బెంగళూరు-హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. ఈ మూడు కారిడార్లలో పలు చోట్ల ప్రభుత్వం అన్ని మౌలిక వసతులతో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఈ కారిడార్ల పరిధిలో 46,555 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. విశాఖ-చెన్న్కె కారిడార్ పరిధిలో అచ్యుతాపురం, నక్కపల్లి, కడప, చిత్తూరు నోడ్స్‌ను అభివృద్ధి చేస్తుండగా, చెన్న్కె-బెంగళూరు కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం వద్ద, బెంగళూరు-హైదరాబాద్ కారిడార్ పరిధిలో ఓర్వకల్లు వద్ద భారీ పారిశ్రామిక పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన కడప నోడ్‌లో ఎకరం రూ.12 నుంచి రూ.15 లక్షలకే లభిస్తుందనే విషయాన్ని విశాఖ సమ్మిట్‌లో ప్రధానంగా వివరించనుంది.
రాష్ట్రంలోని 5 కోట్ల జనాభాలో 70 శాతం మంది యువతీ యువకులు ఉన్నారు. న్కెపుణ్యం ఉన్న మానవ వనరులు రాష్ట్రంలో ఉన్నందువల్ల పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి ఇది ఎంతో తోడ్పాటుగా ఉంటోందని తెలియజేస్తోంది. దీనికి తోడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం ప్రధానంగా ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం.
2021-22లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ (జీఎస్‌డీపీ) 11.43 శాతం వృద్ధితో రూ.7,46,913 కోట్లకు చేరింది. ఇదే సమయంలో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో 12.78 శాతం వృద్ధి నమోద్కెంది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పరిపాలనను తెలియజేస్తున్నా యని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం 2023-28 నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొం దించడంతోపాటు వివిధ రంగాలను ప్రోత్సహించే విధంగా ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది. లాజిస్టిక్ పాలసీ 2022-27, రెన్యువబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ పాలసీ 2020`25, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీ-22, ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2020-25, టూరిజం పాలసీ 2020-25, ఏపీ రిటైల్ పార్క్ పాలసీ 2021-26.. ఇలా అనేక పారిశ్రామిక పాలసీను ప్రవేశపెట్టింది. వీటన్నింటి దృష్ట్యా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా తగిన రాష్టమని విశాఖ సమ్మిట్‌లో ప్రభుత్వం వివరించనుంది.
ఏపీలో పెట్టుబడులకు అనువైన రంగాలను ప్రభుత్వం గుర్తించింది. ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్, అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోనాటికల్ అండ్ ఎలక్ట్రానిక్ వాహనాలు, హెల్త్ కేర్ అండ్ మెడికల్ ఇక్విప్మెంట్, ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ ఇన్ప్రాస్ట్రక్చర్, పెట్రో అండ్ పెట్రో కెమికల్స్,రెన్యువల్ ఎనర్జీ, ఫార్మా అండ్ ల్కెఫ్ సైన్సెస్, టెక్సటైల్ అండ్ అపారెల్స్, టూరిజం, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్, స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్, ఐటి అండ్ జిసిసి రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చని ప్రభుత్వం చెబుతోంది.
వాస్తవ పెట్టుబడులే లక్ష్యంగా నిర్వహిస్తున్న విశాఖపట్టణంలో ఎపి ప్రభుత్వం మార్చి 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రారంభ సమావేశంలో రిలయన్స్ గ్రూపునకు చెందిన ముఖేష్ అంబానీ, అదానీ గ్రూపు గౌతమ్ అదాని, అర్సల్ మిట్టల్ గ్రూపు సీఈవో ఆదిత్య మిట్టల్, ఆదిత్య బిర్లా గూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, టెస్లా కోఫౌండర్ మార్టిన్ ఎంబరహర్డ్ లాంటి 22 మందికిపైగా కార్పొరేట్ ప్రముఖులు పాల్గొంటున్నట్లు అధికారులు వెల్లడిరచారు. మార్చి 3వతేదీన తొలి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్‌రెడ్డి, ఆర్కే సింగ్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన కేంద్ర కార్యదర్శులు ఇందులో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సెమినార్లు నిర్వహించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. సెమినార్లు జరుగుతున్న సమయంలోనే ప్రధాన సమావేశ మందిరంలో ఆహార వ్యవస్థలో మారుతున్న పరిణామ క్రమాలపై ప్రత్యేక చర్చ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. అనంతరం అతిథుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం విందు ఇవ్వనుంది.
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఆహ్వానితులు
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఆహ్వానితుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులు, బిజినెస్ ప్రముఖులు ఉన్నారు. ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆనంద్ మహీంద్రా, కుమార్ మంగళం బిర్లా, ఆది గోద్రేజ్, రిషద్ ప్రేమ్‌జీ, ఎన్. చంద్రశేఖరన్ వంటి భారతీయ పరిశ్రమ దిగ్గజాలను కూడా ఆహ్వానిం చారు. ఈ ఈవెంట్‌కు హాజరు కావాలని ‘‘మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి.. మాతో కలిసి పని చేయమని’’ కోరుతూ అందరికీ ఆహ్వానాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి 15 మంది కేంద్ర మంత్రులు, 15 మంది ముఖ్యమంత్రులు, 44 మంది ప్రపంచ పారిశ్రామికవేత్తలు, 53 మంది భారతీయ పరిశ్రమల ప్రముఖులు, వివిధ దేశాల రాయబారులను కూడా ఆహ్వానించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
ఏపీ టూరిజం కాఫీ టేబుల్ బుక్స్ ఆవిష్కరణ
విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023ను పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం ప్రచురించిన ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్‌లు, సోల్స్ స్పేస్, ఏ టూ జెడ్ టేబుల్ గైడ్ పుస్తకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో టూరిజం డెస్టినేషన్ హబ్‌గా ఎపిని తీర్చి దిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్‌గా ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ అభివృద్ది పథంలో నడిపిస్తూ, పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దేలా ముందుకు సాగాలని సీఎం జగన్ పిలుపు ఇచ్చారు. ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, చైనీస్ భాషల్లో పుస్తకాలను తీసుకువచ్చారు. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లు, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, టూరిజం సెంటర్స్‌లో వీటిని అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్రంలో టూరిజం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణంపై ఈ పుస్తకాలలో ప్రత్యేక కథనాలు పొందుపరిచారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో టూరిజం శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ ఆర్.కరికాల్ వలవెన్, సమాచార శాఖ కమిషనర్ తుమ్మ వి రెడ్డి పాల్గొన్నారు.
వైజాగ్ జిఐఎస్ సమ్మిట్‌కు భారీ బందోబస్తు
ఎన్నో అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు ఆతిథ్యమిచ్చిన మహావిశాఖ తాజాగా మరో రెండు అంతర్జాతీయ సమావేశాలకు సిద్ధమవుతోంది. మార్చి 3, 4 తేదీల్లో విశాఖ ఆంధ్రవిశ్వకళాపరిషత్ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఇక అదే నెల మార్చి 28, 29 తేదీల్లో ప్రతిష్టాత్మకమైన జీ-20 సమావేశాలు రెండు రోజుల పాటు ఇక్కడ నిర్వహిస్తున్నారు. అయితే ఒకే నెలలో రెండు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ స్థాయి సమావేశాలు విశాఖలో జరగనుండడంతో విశాఖ నగరపోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎపి పెట్టుబడుల సదస్సు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండడంతో పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులంతా నగరానికి తరలిరానున్నట్లు సీపీ వెల్లడిరచారు. ఇప్పటి వరకు 6100 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆరుగురు కేంద్రమంత్రులు, మరో ఆరుగురు రాష్ట్ర మంత్రులు, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్తలు హాజరు కానున్నట్లు ఇప్పటి వరకు తమ వద్ద సమాచారం ఉందన్నారు. వీరితో పాటు మరో 282 మంది ప్రముఖ పారిశ్రామిక వేత్తలు పెట్టుబడుల సదస్సులో పాల్గొంటున్నట్లు సీపీ తెలిపారు. వీరందరితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక మంది ఉన్నతస్థాయి అధికారులు, ముఖ్య అధికారులు పెట్టుబడుల సదస్సులో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఇందులో కొంత మంది 3వ తేదన మరికొంత మంది 4వ తేదీన నగరానికి రానున్నట్లు సమాచారం ఉందన్నారు.
ఎక్కువ మంది విదేశీయ వ్యాపారవేత్తలు, వివిధ రంగాల్లో నిష్ణాతులు నగరానికి రానుండడంతో భారీ పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రముఖులు ప్రయాణించే రహదారులు, పాల్గొనే సభాప్రాంగణ ఆ తరువాత పర్యటించే ప్రాంతాల్లోనూ విస్తృతంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మరో వైపు జీ-20 సమావేశాలకు సంబంధించి 49 దేశాలకు చెందిన విదేశీయుల బృందం 28, 29 తేదీల్లో నగరంలో పర్యటించనుందన్నారు. ఇందులో సుమారు 150 మంది విదేశీయులతో పాటు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక మంది ప్రముఖులు తరలిరావడం జరుగుతుందన్నారు.