డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ముందుకు వస్తున్న ఎన్నారైలు - జయరామ్ కోమటి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ఎన్నారైలు ఎందరో ముందుకు వస్తున్నారని అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి చెప్పారు. ఇప్పటికే పలుచోట్ల డిజిటల్ తరగతులను ప్రారంభించామని, మరిన్ని పాఠశాలల్లో కూడా ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలంలోని లింగారావుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్‌రూంల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను డిజిటలైజేషన్ చేయాలన్నదే ఎన్‌ఆర్‌ఐల లక్ష్యమన్నారు. దీనికోసం ఎన్‌ఆర్‌ఐలు కృషి చేస్తామన్నారు. విశాఖపట్టణం జిల్లాలో 300 పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేసేందుకు ఎన్నారైలు ముందుకు వచ్చారని చెప్పారు. అంగన్‌వాడి కేంద్రాల అభివృద్ధికి కూడా కృషిచేస్తామన్నారు. నూతన రాజధాని కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషికి తోడుగా ఎన్‌ఆర్‌ఐలు తమ వంతు తోడ్పాటు అందిస్తామన్నారు.
విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.21 వేల కోట్లను కేటాయించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ముఖ్యమంత్రి విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నారని, అందువల్ల ప్రతి ఒక్కరూ బాగా చదువుకునే అవకాశం కలుగుతోందన్నారు. ఎన్నారైలు తాము చదువుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ముందుకు రావడం సంతోషదాయకమన్నారు.
విదేశాలలో పలు ప్రదేశాలలో ఉంటున్న మన ప్రాంతపు ఎన్‌ఆర్‌ఐలను గురించి వారియొక్క ఆర్థిక సహాయంతో అనేక పాఠశాలలో కొత్త విధానాల ఏర్పాటుకు కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగా లింగరావు పాలెం గ్రామానికి చెందిన ఆలోకం శ్రీరామమూర్తి (శ్రీరామ్) మండలంలోని 12 ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ క్లాసు రూములను ఏర్పాటు చేశారన్నారు. శ్రీరామ్ తల్లిదండ్రులను అమరయ్య, వెంటక లక్ష్మిలను అభినందించాలన్నారు. ఈ సందర్భంగా జయరామ్ కోమటి, శ్రీరామ్, వారి తల్లిదండ్రులను, నల్లపనేని చలపతిరావులను ప్రత్యేకంగా శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా యంఎల్‌సి కరణం బలరాం, యంఎల్‌సి రామకృష్ణ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు.