దాతలను సన్మానించిన జయరాం కోమటి
విశాఖ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ఆర్ధిక సాయం చేసిన దాతలను, వాటి అమలులో ప్రతిభావంతంగా పని చేసిన సిబ్బందిని ఘనంగా సత్కరించారు. ఆదివారం విశాఖలో ఏపీ జన్మభూమి, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో 12 ప్రతిభావంతమైన పనితీరు కనబరిచిన దాతలను, టీచర్లను మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ( ఉత్తర అమెరికా ) జయరాం కోమటి ఘనంగా సత్కరించారు. ఏపీ జన్మభూమి సమన్వయకర్త, తెలుగుదేశం నేత పైలా ప్రసాదరావు మాడుగుల నియోజకవర్గ పరిధిలోని 24 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ఆర్ధిక సాయం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డ్యాష్ బోర్డు ఆధారంగా మాడుగుల నియోజకవర్గ పరిధిలోని కింతలి, చౌడువాడ పాఠశాలలు డిజిటల్ తరగతుల వినియోగంలో మంచి ప్రతిభను కనబరిచాయి. డిజిటల్ తరగతులకు ఆర్ధిక సాయం అందించిన పైలా ప్రసాద రావు తరుపున ఆయన తండ్రి పైలా సన్యాసిరావు ను, పాఠశాల టీచర్లను ఘనంగా సత్కరించారు. శాలువా కప్పి జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా కోమటి జయరాం, మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏపీ జన్మభూమి సమన్వయకర్త పైలా ప్రసాదరావు గ్రామీణ విద్యా వికాసం కొరకు చేస్తున్న సేవలను కొనియాడారు.