ASBL Koncept Ambience

తానాలో ఎపి జన్మభూమి కార్యక్రమంపై సదస్సు

తానాలో ఎపి జన్మభూమి కార్యక్రమంపై సదస్సు

సెయింట్‌లూయిస్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభల్లో ఎపి జన్మభూమి అన్న అంశంపై సదస్సును ఏర్పాటు చేశారు. అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి, సినీనటుడు, ఎంపి మాగంటి మురళీమోహన్‌, ఎపి గ్రామీణాభివృద్ధిశాఖ సంచాలకులు రామాంజనేయులు, తూర్పుగోదావరి జిల్లా జడ్‌పి వైస్‌ చైర్మన్‌ వెంకటరమణ, తానా నాయకుడు లావు అంజయ్య చౌదరి, ప్రసాద్‌ గారపాటి వేదికపై కూర్చున్నారు.

ఈ సందర్భంగా జన్మభూమి పథకంపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. మాగంటి మురళీ మోహన్‌ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1989లోనే జన్మభూమి పథకాన్ని ప్రవేశపెట్టారని, ఇందుకోసం సినిమావాళ్ళమైన తమను సంప్రదించి మంచి పాటను ఈ పథకం కోసం రాయమని చెప్పారని చెప్పారు. దాసరి నారాయణరావు స్వయంగా దీనిపై పాట రాసిన విషయాన్ని ఆయన తెలిపారు. జయరామ్‌ కోమటి నాయకత్వంలో ఎపి జన్మభూమి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. తాను కూడా ఎంపి నిధుల కింద 28 పాఠశాలల్లో డిజిటల్‌ తరగతుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఎన్నారైలు కూడా తమ తమ జిల్లాల్లో ఎపి జన్మభూమి కింద కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రామాంజనేయులు మాట్లాడుతూ తాను కలెక్టర్‌గా పదవిని ఇతర పదవులను నిర్వహించానని, కాని ఇప్పుడు తాను నిర్వహిస్తున్న బాధ్యత వల్ల తనకు ఎంతో సంతృప్తి కలుగుతోందని చెప్పారు.

ముఖ్యమంత్రి నమ్మకంతో తనకు ఎపి జన్మభూమి కింద మూడు బాధ్యతలు అప్పగించారని జయరామ్‌ కోమటి చెప్పారు. అందులో పాఠశాలల డిజిటలైజేషన్‌, అంగన్‌వాడీ భవన కేంద్రాల అభివృద్ధి, శ్మశానవాటికల్లో సౌకర్యాల కల్పన ఉన్నాయని, ఇప్పటివరకు ఎన్నారైల సహాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేస్తూ వస్తున్నామని చెప్పారు. దాదాపు 1500 స్కూళ్ళలో డిజిటల్‌ తరగతులను ఎన్నారైలు ఇచ్చిన విరాళాలతో ప్రారంభించినట్లు తెలిపారు. 100 అంగన్‌వాడీ కేంద్రాలు, 35 శ్మశానవాటికలను అభివృద్ధి చేస్త్నుట్లు తెలియజేశారు. ఎన్నారై కనెక్ట్‌ కార్యక్రమం ద్వారా ఎన్నారైలు ఇప్పుడు ముఖాముఖీగా పాఠశాల విద్యార్థులతో, టీచర్లతో సంభాషిస్తున్నారని చెప్పారు.  ఈ సందర్భంగా ఎపి జన్మభూమి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలపై ప్రజంటేషన్‌ను ఆయన చూపించారు.

ఎపి జన్మభూమి వ్యవహారాలను చూస్తున్న ప్రసాద్‌ గారపాటి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలి అమెరికా పర్యటనలో జన్మభూమి కార్యాలయాన్ని సందర్శించి స్కిల్డ్‌ డెవలప్‌మెంట్‌ బాధ్యతను కూడా తమకు అప్పగించారని చెప్పారు. స్కిల్డ్‌ డెవలప్‌మెంట్‌ కింద పలు ప్రాంతాల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గుంటూరు మాజీ జడ్‌పి చైర్‌పర్సన్‌ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ, గతంలోనే తాము జన్మభూమి కార్యక్రమం కిందఎన్నారైల నుంచి విరాళాలను వసూలు చేసి దాదాపు 45 లక్షలరూపాయలతో పనులను చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. జయరామ్‌లాంటి సమర్థుడైన నాయకుని నేతృత్వంలో ఎపి జన్మభూమి కార్యక్రమాలు మరింత ఊపందుకుంటాయన్న విషయంలో సందేహమే లేదని అన్నారు.

Tags :