ASBL Koncept Ambience

ఫీనిక్స్ లో కోడెలకు ఘనస్వాగతం

ఫీనిక్స్ లో కోడెలకు ఘనస్వాగతం

నవ్యాంధ్ర అభివృద్ధిలో ఎన్నారైలను భాగస్వాములను చేసేందుకు జన్మభూమి ప్రచార కార్యక్రమాన్ని అమెరికాలో వివిధ నగరాల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచార కార్యక్రమాల్లో అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్‌ కోమటితో కలిసి ఎపి అసెంబ్లీ స్పీకర్‌ డా. కోడెల శివప్రసాదరావు కూడా పాల్గొంటున్నారు. అరిజోనాలోని ఫీనిక్స్‌ నగరానికి వచ్చిన డా. కోడెల శివప్రసాదరావుకు, జయరామ్‌ కోమటికి ఎన్నారైలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో అపారమైన సహజ వనరులు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకునేలా విదేశాంధ్రులు ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని కోరారు.

జన్మభూమి బాగుకోసం ప్రతి ఒక్కరు నడుంబిగించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎపి ప్రభుత్వం కూడా పెట్టుబడులు పెట్టేవారికోసం అనుమతులను సులభంగా మంజూరు చేసేందుకు సింగిల్‌విండో విధానాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. జయరామ్‌ కోమటి జన్మభూమి అభివృద్ధిలో భాగంగా ఎంచుకున్న డిజిటల్‌ తరగతి గదుల ఏర్పాటు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, మహాప్రస్థానాల అభివృద్ధి వంటివి మంచి కార్యక్రమాలని కోడెల శివప్రసాదరావు అన్నారు. ఈ లక్ష్యసాధనకు అందరూ ముందుకు రావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. జయరామ్‌ కోమటి మాట్లాడుతూ, జన్మభూమి అభివృద్ధిలో చంద్రబాబు చేస్తున్న కృషికి మద్దతుగా ఎన్నారైలు సహకారాన్ని అందించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతుల ఏర్పాటులో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫీనిక్స్‌లోని తెలుగువాళ్ళు పెద్దఎత్తున పాల్గొన్నారు.


Click here for Photogallery

 

Tags :