సిలికానాంధ్ర సేవలు ప్రశంసనీయం - కోడెల
తెలుగు భాషను పరిరక్షించేందుకు సిలికానాంధ్ర చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ డా. కోడెల శివప్రసాదరావు అన్నారు. బే ఏరియాలోని సన్నివేల్ దేవాలయంలో జరిగిన సిలికానాంధ్ర 15వ వార్షిక వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కూచిపూడి నాట్యకళ అభివృద్ధితోపాటు, కూచిపూడి గ్రామాన్ని స్మార్ట్ విలేజ్‌గా రూపొందించి సిలికానాంధ్ర ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అమెరికాలో 'మనబడి' ద్వారా తెలుగు భాషాభివృద్ధికి ఆ సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని చెప్పారు. ఈ సేవలకు గుర్తింపుగానే సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు ఆనంద్ కూచిభొట్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్ పదవి ఇచ్చారని తెలిపారు. ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి మాట్లాడుతూ, జన్మభూమి పథకం కింద ఇతర చోట్ల ఉన్న గ్రామాల అభివృద్ధికి కూడా సిలికానాంధ్ర సభ్యులు, నాయకులు ముందుకు రావాలని కోరారు.