ASBL Koncept Ambience

డిసెంబర్ 3న 'వైఎస్సార్ లా నేస్తం' ప్రారంభం

డిసెంబర్ 3న 'వైఎస్సార్ లా నేస్తం' ప్రారంభం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మరో హామీ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వత్తిలోకి కొత్తగా ప్రవేశించిన న్యాయవాదులకు నెలకు రూ.5 వేల చొప్పున స్టైఫండ్‌ ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. 'వైఎస్సార్‌ లా నేస్తం' పేరుతో ఈ కార్యక్రమాన్ని డిసెంబర్‌ 3న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారు. ప్రాక్టీస్‌లో మూడేళ్ల కంటే తక్కువ అనుభవం ఉన్న న్యాయవాదులకు మొదటి మూడేళ్ల పాటు నెలకు రూ.5వేల చొప్పున చెల్లిస్తారు. ప్రస్తుతం బార్‌ కౌన్సిల్‌లో నమోదైన న్యాయవాదులు 61వేల మంది ఉన్నారు. ఏటా కొత్తగా 1,500 మంది ఎన్‌రోల్‌ అవుతున్నారు.

ఈ పథకానికి ysrlawnestham.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతోపాటు ఆధార్‌ నంబర్‌ను జత చేయాలి. స్టైఫండ్‌ ఏ బ్యాంకు ఖాతాలో జమ కావాలని కోరుకుంటున్నారో ఆ వివరాలు అందజేయాలి.

వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌/మున్సిపల్‌ కమిషనర్లు గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ/వార్డు వలంటీర్లకు పంపుతారు. వీరి పరిశీలనలో దరఖాస్తు సరైనదేనని తేలిన తరువాత, జిల్లా కలెక్టర్‌ ఆమోదం తీసుకుని ఆ దరఖాస్తును మున్సిపల్‌ కమిషనర్‌, ఎంపీడీవోలు సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. సోషల్‌ ఆడిట్‌ కోసం ఆ దరఖాస్తును గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ప్రదర్శిస్తారు. అర్హులైన వారి బ్యాంకు ఖాతాల్లో స్టైఫండ్‌ను జమ చేస్తారు. రశీదును వార్డు వలంటీర్‌ ఇంటికి తెచ్చి ఇస్తాడు.

దరఖాస్తుదారు న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో నమోదై ఉండాలి. 2016, ఆ తరువాత ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే స్టైఫండ్‌ కు అర్హులు. న్యాయవాద చట్టం సెక్షన్‌ 22 కింద ఎన్‌రోల్‌మెంట్‌ సర్టిఫికెట్‌ జారీ చేసిన నాటి నుంచి తొలి మూడేళ్ల ప్రాక్టీస్‌ను లెక్కిస్తారు. ఈ జీవో జారీ అయ్యే నాటికి ప్రాక్టీస్‌ ప్రారంభించి తొలి మూడేళ్లు పూర్తి కాకపోతే మిగిలిన సంవత్సరాలకు స్టైఫండ్‌కు అర్హులవుతారు. దరఖాస్తుదారు తాను ఇంకా ప్రాక్టీస్‌లో కొనసాగుతున్నానని 15 సంవత్సరాల అనుభవం ఉన్న సీనియర్‌ న్యాయవాది, లేదా సంబంధిత బార్‌ అసోసియేషన్‌, లేదా సంబంధిత కోర్టు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ల నుంచి అఫిడవిట్‌ సమర్పించాలి.

న్యాయవాదిగా నమోదైన తరువాత, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, రెండేళ్ల లోపు సర్టిఫికెట్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ను సమర్పించాలి. దరఖాస్తుదారు న్యాయవాద వత్తిని విడిచి వెళ్లినా, మరో ఉద్యోగం సంపాదించినా, ఆ విషయాన్ని ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్టరింగ్‌ అథారిటీకి తెలియచేయాలి. ఒకే కుటుంబం.. ఒకే ప్రయోజనం కింద కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ స్టైఫండ్‌ను అందచేస్తారు. ప్రతీ దరఖాస్తుదారు కూడా ఆధార్‌కార్డు కలిగి ఉండాలి.

అనర్హతలు..

ఈ జీవో జారీ చేసే నాటికి జూనియర్‌ న్యాయవాది వయస్సు 35 సంవత్సరాలు దాటకూడదు. నాలుగు చక్రాల వాహనం ఉన్న జూనియర్‌ న్యాయవాది స్టైఫండ్‌కు అనర్హుడు. న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకుని, న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేయకుండా ఇతర ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న వారు కూడా అనర్హులే.

 

Tags :