ASBL Koncept Ambience

హైదరాబాద్ లో తయారీ సంస్థ ఏర్పాటుకు కన్‌ఫ్ల్యూయెంట్ అంగీకారం

హైదరాబాద్ లో తయారీ సంస్థ ఏర్పాటుకు కన్‌ఫ్ల్యూయెంట్ అంగీకారం

ప్రపంచ ప్రఖ్యాత మెడికల్‌ డివైసెస్‌ తయారీ కంపెనీ కన్‌ఫ్లూయెంట్‌ మెడికల్‌ కంపెనీ హైదరాబాద్‌లో తన యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. పైలట్‌ ప్రాతిపదికన ఒక తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఏడాదిలో భారీగా విస్తరించాలని ప్రణాళికలు రూపొందించింది. అమెరికాలో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన కంపెనీ చైర్మన్‌, సీఈవో డీన్‌ షావర్‌ ఈ మేరకు ప్రకటించారు. భారతదేశానికి తొలిసారిగా అత్యంత అధునాతన టెక్నాలజీ ని తీసుకురావాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌ నగరాన్ని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నామని, భవిష్యత్తులో తమ కంపెనీని భారీగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామని చెప్పారు. త్వరలోనే తమ కంపెనీ బయోమెడికల్‌ టెక్స్‌టైల్‌ సేవలకు సంబంధించి విధివిధానాలను ప్రకటిస్తామని తెలిపారు. తమ తయారీ యూనిట్‌ ఏర్పాటు కోసం హైదరాబాద్‌ నగరాన్ని ఎంచుకున్న కన్‌ఫ్లూయెంట్‌ మెడికల్‌ టెక్నాలజీ సంస్థకు మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తరఫున తయారీ యూనిట్‌ ఏర్పాటుకు సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. భవిష్యత్తులో సంస్థతో తెలంగాణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పని చేద్దామని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

కాగా, కన్‌ఫ్లూయెంట్‌ సంస్థ.. నింతోల్‌ ఉత్పత్తుల తయారీ కోసం అగ్రశ్రేణి సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్‌కు తీసుకురానుంది. దీంతో దేశంలో ఈ స్థాయి టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేసే మొదటి కంపెనీగా కన్‌ఫ్లోయంట్‌ మెడికల్‌ నిలవనున్నది. దేశంలోని మెడికల్‌ డివైసెస్‌ తయారీ కంపెనీలకు తన ఉత్పత్తుల ఆధారంగా సేవలను అందించనుంది. హైదరాబాద్‌లో స్థాపించబోయే తన తయారీ యూనిట్‌ ద్వారా భారతదేశంతో పాటు ఆసియాలోని సంస్థలకు తమ ఉత్పత్తులను సరఫరా చేయనున్నది.

 

Tags :