కృత్రిమ మేథస్సుకు వేదికగా ఎపిని మలచుకోండి - చంద్రబాబు
కృత్రిమ మేథస్సు (ఆర్టిఫీషియల్ టెక్నాలజీ)కు సంబంధించిన పరిశోధన, పరికరాల ప్రయోగాలకు అవసరమైన భూవసతిని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటు ధరలో సమకూర్చడానికి సిద్ధంగా వుందని, ఈ రంగంలో క్షేత్రస్థాయి ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్‌ను వేదికగా మలచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. 'కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్)-నమూనా పరిణామ క్రమం' అనే అంశంపై న్యూయార్క్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆ రంగానికి చెందిన పరిశ్రమ ప్రముఖులతో ముఖ్యమంత్రి పలు అంశాలపై చర్చించారు.
కృత్రిమ మేధస్సు ఆవశ్యకతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ సాగింది. ఈ రంగంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఇప్పటికే 'ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ క్లౌడ్ హబ్ పాలసీ-2018' పేరుతో ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టామని సమావేశంలో వివరించారు. స్టార్టప్ అండ్ ఇన్నోవేటీవ్ పాలసీ, ఐవోటీ పాలసీ, డీటీపీ పాలసీ, గేమింగ్ అండ్ యానిమేషన్ హబ్ పాలసీ పేరుతో సరికొత్త ప్రభుత్వ విధానాలను పరిచయం చేసి ఈ రంగంలో పెట్టుబడులను రాబడుతున్నామని, ఆకర్షణీయమైన ప్రోత్సాహాలతో సాంకేతిక దిగ్గజాలను ఆకట్టుకుంటున్నామని తెలిపారు. విశాఖలో మెడ్ టెక్, ఫిన్ టెక్ ప్రగతిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. రియల్‌టైమ్ గవర్నెన్స్, ఇ-ప్రగతి, క్లౌడ్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలలో ఒక దశను దాటి ముందుకు వచ్చామని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ఏ ఆవిష్కరణ చోటుచేసుకున్నా దాన్ని ఏపీకి తీసుకురావాలన్నదే అంతిమంగా తన అభిలాష అని పేర్కొన్నారు.
సుస్థిరాభివృద్ధిలో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యంగా ఏపీ వంటి కొత్త రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధిని వేగవంతంగా సాధించడానికి కృత్రిమ మేధస్సుదే ముఖ్య భూమిక అని అన్నారు. ప్రజల సంతోషం, సంతృప్తి స్థాయులను పెంచడానికి వీటిని తాము విస్తతంగా వినియోగించుకుంటున్నామని తెలిపారు. కృత్రిమ మేధస్సు వల్ల జీవన సౌలభ్యం పెరుగుతుందని చెప్పారు.
ఏపీలో కృత్రిమ మేధస్సు రంగానికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని, ఫిన్‌టెక్, బ్లాక్ ఛెయిన్, మెడ్ టెక్, డ్రోన్ టెస్టింగ్, అటానమస్ వెహికిల్ టెస్టింగ్ తదితర విభాగాలలో ఇప్పటికే ముందడుగు వేశామని రౌండ్ టేబుల్ సమావేశంలో సీయం వివరించారు. పాలనలో ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలించి విశ్లేషిస్తున్నమని, దీనికోసం రియల్‌టైమ్ గవర్నెన్స్ ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుపుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. క్లౌడ్ మేనేజ్‌మెంట్, డేటా స్టోరేజ్, అనలైజింగ్ ద్వారా ప్రభుత్వ పాలనలో నాణ్యతా ప్రమాణాలను పెంచగలిగామని తెలిపారు. ఆధార్ తరహాలో భూధార్ ప్రవేశపెట్టి ల్యాండ్ రికార్డులు తారుమారు కాకుండా సురక్షితంగా వుంచే వ్యవస్థను ప్రవేశపెట్టామని వివరించారు.
కృత్రిమ మేధస్సుకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ప్రాథమిక విద్య నుంచే పరిచయం చేయాలని ఈ సమావేశం ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. దీనికోసం మూస విధానాలతో కాకుండా డొమైన్ ఎక్స్‌పర్టులతో విద్యాబోధన జరిగేలా మార్పులు తీసుకురావాలని సమావేశంలో పాల్గొన్న నిపుణులు సూచించారు. ప్రాథమిక విద్యకు సాంకేతిక విద్య జోడింపుతో ఏపీని అత్యుత్తమ విద్యాధామంగా తీర్చిదిద్దాలన్న తమ ప్రయత్నం తప్పకుండా నెరవేరుతుందని, దీనికి తోడ్పాటునందించడానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న ఏఐ టెక్నాలజీ రంగ నిపుణులను కోరారు. అంగన్‌వాడీ కేంద్రాల స్థాయి నుంచే చదువుల్లో ప్రమాణాలను పెంచే కృషి ఆరంభించామని సమావేశానికి వివరించారు. పాఠశాల విద్యలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని అన్నారు. ముఖ్యంగా వర్చువల్, డిజిటల్ తరగతుల బోధన తాము సాధించిన విప్లవాత్మక ప్రగతిగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యాలయాలను ప్రపంచ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
సిలికాన్ వ్యాలీలో పలు టెక్నాలజీ సంస్థలకు మార్గదర్శిగా వున్న రమణ జంపాల ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఏఐ టెక్నాలజీ వినియోగంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చొరవకు సదస్సులో పలువురి నుంచి ప్రశంసలు లభించాయి. డేటా క్యాంప్ ఛీఫ్ డేటా సైంటిస్ట్ డేవిడ్ రాబిన్‌సన్, ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ డైరెక్టర్ యూరీ అగియార్, ఇన్నోవేటీవ్ టెక్నాలజీ లీడర్ టిమ్ సులివాన్, గ్లోబల్ బిజినెస్ లీడర్ రాజ్ పాటిల్, ఫైనాన్షియల్ సర్విసెస్ రంగ ప్రముఖుడు శ్రీధర్ చిట్యాల, 212 మీడియా సహ వ్యవస్థాపకులు నియాల్ షెనాయ్, ఇంకా, రెనా నిగమ్, శ్రీరామ్ రాజప్ప తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.