తెలంగాణలో ప్రచారం ఫుల్....
తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల ప్రచారఘట్టం ఫుల్‌గా, జోష్‌గా సాగింది. ఇన్నాళ్ళపాటు అభ్యర్థులతోపాటు ఆయా పార్టీల ప్రముఖ నాయకులు, సినిమా తారలు, ఇతర ప్రముఖులు పాల్గొని తెలంగాణను తమ ప్రచారాలతో హోరెత్తించారు.
మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుత ఎన్నికల్లో గ్రేటర్‌పై అన్ని రాజకీయ పక్షాలు ప్రధాన దష్టి సారించి అగ్రనేతలందరినీ ప్రచారపర్వంలోకి దింపాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మొదలు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, చంద్రబాబు, శివరాజ్‌సింగ్ చౌహాన్, దేవేంద్ర ఫడ్నవీస్‌లు ప్రజాకూటమి, బీజేపీ తరఫున ప్రచారం చేశారు. మేడ్చల్‌లో సోనియా, పరేడ్‌గ్రౌండ్స్‌లో కేసీఆర్, ఎల్బీస్టేడియంలో మోదీల సభలు ప్రతిష్టాత్మకంగా జరగ్గా, ఆయా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి.
కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, నఖ్వీ, నడ్డా, గోపీనాథ్ ముండే, నితిన్ గడ్కరీ తదితరులు బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయా నియోజవర్గాల్లో ప్రచారం చేశారు. సినీతారలు ఖుష్బూ, నగ్మా, విజయశాంతి, క్రికెటర్లు అజారుద్దీన్, సిద్ధూలతో పాటు కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, జైరాం రమేష్, కర్ణాటక మంత్రి శివశంకర్ ప్రజాకూటమి తరఫున ప్రచారం చేశారు. వీరేగాక.. కాంగ్రెస్‌కు చెందిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, వీరప్ప మొయిలీ, కర్ణాటక పీసీసీ చీఫ్ దినేష్ గుండు వంటివారు సైతం రంగంలోకి దిగారు. ఇంకా ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించిన పలువురు అక్కడ అవకాశం రాకపోవడంతో బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీఫామ్‌లు తీసుకున్నారు. ఈ క్రమంలోనే మేడ్చల్‌లో బీఎస్పీ బహిరంగసభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మాయావతి హాజరైన ఆ పార్టీ అభ్యర్థులు, శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.
అధికార టీఆర్‌ఎస్ విషయానికి వచ్చేసరికి ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నీతానై నడిపించారు. గ్రేటర్ పరిధిలోని మెజారిటీ నియోజకవర్గాల్లో ఆయనే రోడ్‌షోలు నిర్వహించి, టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. కూకట్‌పల్లి నుంచి దివంగత నందమూరి హరికష్ణ కూతురు సుహాసిని టీడీపీ తరఫున బరిలో ఉండడంతో చంద్రబాబు, బాలకష్ణ లు ఆమె కోసం రోడ్‌షోలు నిర్వహించగా.. ఏపీ టీడీపీ ముఖ్యనేతలంతా ఇక్కడే మకాం వేశారు. ప్రజాకూటమి అభ్యర్థుల తరఫున చంద్రబాబు, రాహుల్‌గాంధీ, కె.నారాయణ ఒక జట్టుగా పలు నియోజకవర్గాల్లో జరిగిన రోడ్‌షోల్లో పాల్గొన్నారు.