ASBL Koncept Ambience

కొత్త సంప్రదాయాన్ని మొదలుపెట్టిన ఆటా-టాటా

కొత్త సంప్రదాయాన్ని మొదలుపెట్టిన ఆటా-టాటా

(చెన్నూరి వెంకట సుబ్బారావు)

అమెరికాలో సరికొత్త అధ్యాయానికి అమెరికా తెలుగు సంఘం (ATA), తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TATA) నాంది పలికాయి. రెండు సంఘాలు కలిసి కార్యక్రమాలను సంయుక్తంగా నిర్వహించడమే కాక, అందులో విజయాన్ని సాధించి సరికొత్త అధ్యాయాన్ని సృష్టించాయి. అమెరికాలో జాతీయ సంఘాలు ప్రాంతీయ సంఘాలతో కలిసి కార్యక్రమాలను నిర్వహించడం సహజం. కాని రెండు జాతీయ సంఘాలు కలిసి కార్యక్రమాలను నిర్వహించడం ఇదే ప్రథమం. ఈ వేడుకకు మాతృరాష్ట్రం వేదిక కావడం మరో విశేషం.   మాతృరాష్ట్రంలో ఆటా, టాటా కలిసి సేవా దినోత్సవ ముగింపు వేడుకలను వైభవంగా, విభిన్నంగా నిర్వహించి అందరి మన్ననలను అందుకోవడంతోపాటు సంఘాలు వేరైనా తామంతా ఒక్కటే అన్న సందేశాన్ని తెలియజేసింది. ఇది నిజంగా శుభపరిణామం. పోటాపోటీ వేడుకలతో, మహాసభలతో మిలియన్‌ డాలర్లను వృధాగా ఖర్చు చేస్తున్న సంఘాలు కలిసి చేసే వేడుకలతో ఈ దుబారా వ్యయానికి అడ్డుకట్ట వేయవచ్చని ఈ కార్యక్రమం ద్వారా ఆటా, టాటా తెలియజేసింది.

అమెరికా తెలుగు కమ్యూనిటీని గత 30 సంవత్సరాల నుంచి దగ్గరగా చూస్తున్న నాకు ఈ పరిణామం మంచి సంకేతమని అనిపిస్తూ, అప్పుడు జరిగిన ఇలాంటి విషయం ఒకటి గుర్తుకు వచ్చింది. 1989-90లో తానా నుంచి ఓ వర్గం విడిపోయి ఆటాగా ఏర్పడటం, 1992లో తెలుగు మహాసభలను ఆటా సంస్థ దిగ్విజయం నిర్వహించి కమ్యూనిటీలో బలంగా పాతుకుపోవడం నాకు ఇంకా గుర్తు ఉంది. ఆ తరువాత 1993లో తానా వారు కూడా ఆ మహాసభలకు పోటీగా భారీగా న్యూయార్క్‌లో తెలుగు మహాసభలు చేయడం, మళ్ళీ 1994లో ఆటావారు అందుకు పోటీగా తెలుగు మహాసభలను నిర్వహించడం చేశారు. సంవత్సరాలు గడిచేకొద్ది రెండు సంఘాలలో ఆవేశాలు తగ్గడంతోపాటు, కమ్యూనిటీ ప్రముఖుల నుంచి వచ్చిన సూచనలతో 1994లో ఆటా-తానా నాయకులు కలిసి చర్చించుకుని రెండు సంఘాలు సామరస్యంగా ఉండాలని,  సభలను పోటాపోటీగా కాకుండా ఒక్కో సంవత్సరం ఒక్కొక్కరూ జరుపుకునేలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆటా సభలకు తానా వాళ్ళు, తానా సభలకు ఆటా వాళ్ళు హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. అప్పుట్లో ఇ-మెయిల్స్‌ లేవు కాబట్టి, ఆటా-తానాల మధ్య కుదిరిన ఒప్పందపత్రాలను  నేనే స్వయంగా అమెరికా నుంచి అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డికి సమర్పించడం జరిగింది. తరువాత ఆ ఒప్పందం ప్రకారమే సభలు సమావేశాలను తానా, ఆటా నాయకులు చేస్తూ వస్తున్నారు.

1994 రోజుల కంటే 2015 రోజులు మరింత ముఖ్యమైనవి. కమ్యూనిటీ పెరిగి, ఒక మిలియన్‌ దాటిపోయి, అమెరికాలో అత్యధికంగా ఉన్న సంతతిగా భారతీయ కమ్యూనిటీ గుర్తింపును తెచ్చుకుంది. అప్పటికంటే ఇప్పుడు యువకులు బాగా పెరిగారు. వారి ఆలోచనలు, అప్పటికంటే వేగంగా ఉన్నాయి. వారి కోరికలు కూడా ఎక్కువే. ఆవేశాలు కూడా ఎక్కువే. అందుకనే ఇదివరకు రోజులకంటే ఇప్పుడు నాయకుడు ఎవరైనా సరే తెలుగు సంఘాలను నిర్వహించడంలో ఎక్కువ సమయం, ఎక్కువ డబ్బును వెచ్చించాల్సి ఉంటోంది. కొత్త సభ్యులను చేర్పించడంలో కంటే ఉన్న సభ్యులను అందరినీ కలుపుకుంటూ వెళ్ళడానికే సమయాన్ని ఎక్కువగా వెచ్చించాల్సి వస్తోంది.

మరక మంచిదే అన్న సర్ఫ్‌ అడ్వర్టయిజ్‌మెంట్‌లాగా ఇన్ని సంఘాలు రావడం వల్ల కమ్యూనిటీకి ఏదో విధంగా మంచి జరిగితే మేలే కదా!. అందువల్లన ఆటా విడిపోయి నాటా రావడం, తానా విడిపోయి నాట్స్‌ రావడంతో కమ్యూనిటీకి చేసే సేవల విస్తరణ కూడా జరిగింది. పోటీ బాగా పెరిగి, తెలుగు సంఘాలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్న సమయంలో రాష్ట్రం రెండుగా విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో దాని ప్రభావం అమెరికాలోని తెలుగు సంఘాలపై కూడా పెరిగింది. దీంతో ప్రతి పట్టణంలోనూ తెలంగాణవాసులకోసం కొత్త సంఘాలు ఏర్పడ్డాయి. అప్పుడే నాటా నుంచి కొంతమంది విడిపోయి టాటాను ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి సేవలు అందించడానికి అమెరికాలోని తెలంగాణ నుంచి వచ్చిన తెలుగువారికోసం ఈ టాటా ఏర్పడింది. పబ్లిసిటీకి దూరంగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో ముందుండే డా. పైళ్ల మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ టాటా ఏర్పడింది. టాటా 2015లో పుట్టి, ఆ సంవత్సరమే వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించి గుర్తింపును తెచ్చుకుంది.

ఒకటికి రెండు, రెండుకు నాలుగు జాతీయ సంఘాలు రావడంతో సభల నిర్వహణలో ఖర్చులు మించిపోవడంతో సభల నిర్వహణ భారం నాయకత్వానికి సవాల్‌గా మారింది. ఆ సమయంలోనే ఆటా,నాటా,టాటా నాయకులు అందరూ ఒకచోట సమావేశమై సంస్థలు విడిగా ఉన్నా, ముఖ్యమైన తెలుగు సభలను మాత్రం కలిసి నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఆటా వ్యవస్థాపకులు హనుమంతరెడ్డి, నాటా వ్యవస్థాపకులు డా. ప్రేమ్‌సాగర్‌ రెడ్డి, టాటా వ్యవస్థాపకులు డా. పైళ్ళ మల్లారెడ్డి కలిసి ఈ విధమైన నిర్ణయాన్ని తీసుకోవడాన్ని కమ్యూనిటీ ప్రముఖులు చాలామంది హర్షించారు.

తెలుగు సభల నిర్వహణకు దాదాపుగా 1.5 నుంచి 2.0 మిలియన్‌ డాలర్లు ఖర్చవుతాయి. ఇందులో రిజిస్ట్రేషన్‌ పరంగా వచ్చే డబ్బు 35శాతం ఉంటుంది. స్పాన్సర్‌షిప్‌ ద్వారా మరో 15శాతం లభిస్తుంది. మిగిలిన 50శాతం డబ్బులకోసం నాయకులు ఊరూరా తిరిగి వసూలు చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఆయా ఊరిలో పెద్దమొత్తంలో విరాళాలు ఇచ్చేవాళ్ళ సంఖ్య స్వల్ఫంగానే ఉంటుంది. దీంతో అన్నీ సంఘాల నాయకులు వారిపైనే ఆధారపడటం సహజం. ఈ నేపథ్యంలో తామంతా కలిసి మహాసభలను నిర్వహిస్తే ఖర్చుల భారం తగ్గిపోతుందన్న ఉద్దేశ్యంతో నాయకులంతా కలిసి కూర్చుని నిర్ణయం తీసుకున్నారు. తరువాత నాటా సంయుక్త మహాసభల నిర్వహణకు దూరమైపోవడంతో ఆటా, టాటానే కలిసి నిర్వహించాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే మాతృరాష్ట్రంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల ముగింపు కార్యక్రమాన్ని ఇరు సంఘాలు కలిసి నిర్వహించాయి.

హైదరాబాద్‌లోని శిల్పారామంలో జరిగిన ఈ ముగింపు వేడుకలు అందరినీ ఎంతగానో అలరించాయి. ముగింపు వేడుకల్లో కూడా రెండు సంఘాల నాయకులు ఎక్కడా విభేదాలకు తావివ్వకుండా ప్రణాళికా ప్రకారం నిర్వహించి అందరి మన్ననలను పొందాయి. ఇదే విధంగా రాబోయే మహాసభలను కూడా పక్కా ప్రణాళికతో నిర్వహిస్తామని ఇరు సంఘాలు ప్రకటించాయి. ఇది నిజంగా కమ్యూనిటీకి శుభపరిణామమే. 2017 ముగింపు సంఘాల మధ్య సామరస్యాన్ని తీసుకువచ్చింది. 2018 సంవత్సరం ఈ సామరస్యాన్ని మరింత పటిష్టం చేసి కమ్యూనిటీకి మరింత బలాన్ని చేకూర్చేలా, అందరూ కలిసి మరింత వైభవంగా సభలను దిగ్విజయంగా చేసి కమ్యూనిటీకి మరింత గుర్తింపును తీసుకువస్తారని ఆశిద్దాము.


Click here for Event Gallery

 

 

Tags :