తెలంగాణ, అమెరికా మధ్య సంబంధాలు పెంచేలా సాగిన ఆటా బిజినెస్ సెమినార్
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వేడుకల్లో భాగంగా భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)తో కలిసి మాదాపూర్ టీ హబ్‌లో నిర్వహించిన సెమినార్‌కు మంచి స్పందన వచ్చింది. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ఆటా వేడుకల చైర్ జయంత్ చల్లా, ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ హాజరై మాట్లాడారు.
ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని మాట్లాడుతూ, తెలంగాణ, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడాలన్న ఉద్దేశ్యంతో ఈ సెమినార్‌ను ఏర్పాటు చేశామన్నారు.
ఆటా వేడుకల కమిటీ చైర్ జయంత్ చల్లా మాట్లాడుతూ, భారత్-అమెరికా భాగస్వామ్యాలను ప్రోత్సహించి, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వాణిజ్యవేత్తలను ప్రోత్సహించడానికి ఈ ఆటా బిజినెస్ సెమినార్ ఒక మంచి ప్రయత్నమని అన్నారు. ఇప్పటివరకు భారతీయ స్టార్టప్‌లలో దాదాపు 20 మిలియన్ డాలర్లు (రూ.150 కోట్లకు పైగా) పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ బిజినెస్ సెమినార్ల వల్ల పలు సంస్థలు టైర్-2 నగరాలకు తరలాయన్నారు. ఖమ్మంలో టీ హబ్ ప్రారంభించడం ఆటా సాధించిన ఓ అతిపెద్ద విజయమని అభివర్ణించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పెట్టుబడిదారులకు ఏ సమస్యలున్నా తీర్చే బాధ్యత తమదని అన్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణలో ఎక్కడ పెట్టుబడులకు వచ్చినా ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానిస్తామన్నారు. అభివృద్ధిలో వ్యాపార, పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని కోరారు. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలున్నాయని.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధికి బీజాలు పడ్డాయని చెప్పారు. అమెరికా- భారత్ మధ్యన ముఖ్యంగా తెలంగాణతో చక్కటి సంబంధాలున్నాయని, వాటిని విస్తరించేందుకు కృషి చేస్తామన్నారు.
జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ వీసా ప్రాసెసింగ్ కోసం అత్యధిక కౌంటర్లు హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశామన్నారు. స్పౌజ్ వీసాల ప్రాసెసింగ్‌ను ప్రారంభించే ప్రణాళికలేవీ లేవన్నారు. అమెరికాలో తెలుగు వారు ఎక్కువగా ఉన్నారని, వారంతా ఎంతో ఉన్నతంగా ఎదిగారని పేర్కొన్నారు. వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటా కార్యక్రమానికి హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్, అమెరికా మధ్య సంధానకర్తగా ఆటా వ్యవహరించడం అభినందనీయమని కొనియాడారు. నగరానికి అమెరికా పెట్టుబడులు రావడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
వ్యాపారాలకు సంబంధించిన ఆలోచనలను ప్రోత్సహించడం, యువ వాణిజ్య వేత్తలకు మెంటారింగ్, వెంచర్ క్యాపిటలిస్టులకు ఒక వేదిక కల్పించడం, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశ్షారు. ఇందులో అమెరికా, భారత్‌కు చెందిన మెంటార్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, వాణిజ్య వేత్తలు, సాంకేతిక నిపుణులు దాదాపు 100 మంది పాల్గొన్నారు.
ఆటా వేడుకల బిజినెస్ కమిటీ చైర్ కాశీ కొత్త మాట్లాడుతూ.. ‘ఈ బిజినెస్ సెమినార్ ఎజెండా బహుముఖమైంది.. అమెరికాలో స్థిరపడిన తెలుగు వాణిజ్యవేత్తలు, తెలంగాణలోని వ్యాపారవేత్తల మధ్య అనుసంధానం, అనుబంధం పెంచడం.. అలాగే భారత్‌లో.. ముఖ్యంగా తెలంగాణలోని స్టార్టప్ కంపెనీలకు మెంటారింగ్ చేసి, వాటిలో పెట్టుబడులు పెట్టడం.. ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ లాంటి టైర్-2 నగరాలకు మరిన్ని కంపెనీలను ఆకర్షించడమే ప్రోగ్రాం ప్రధాన లక్ష్యాలు..’ అని చెప్పారు.
సదస్సులో సీఐఐ తెలంగాణ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డితోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు ఆటా నాయకులు తదితరులు పాల్గొన్నారు.