టీహబ్‌లో ఆటా బిజినెస్ సెమినార్ సక్సెస్
అమెరికా తెలుగు సంఘం (ఆటా) మాతృరాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఆటా వేడుకల కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లోని టీ హబ్‌లో బిజినెస్ సెమినార్‌ను నిర్వహించింది. ఈ సెమినార్‌కు ముఖ్య అతిధిగా తెలంగాణ ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో పుట్టిపెరిగినవారిగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడమే కాకుండా, అమెరికా నుంచి ఇక్కడికి పెట్టుబడులు తీసుకువచ్చేలా కృషి చేయాలని, తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చే తెలుగువారికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. పెట్టుబడులతో ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు మరో రెండు ద్వితీయ శ్రేణి పట్టాణాల్లో ఐటీహబ్‌లను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన వాతావరణం ఉన్నదని, టీఎస్‌ఐపాస్ ద్వారా అతి తక్కువ సమయంలో అనుమతిలిస్తున్నామని తెలిపారు. అమెరికా తెలుగు సంఘం ఇలాంటి సమావేశాలు నిర్వహించడంతో పెట్టుబడులు ఎక్కువగా వచ్చే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్‌కార్డుపై అవగాహన, స్టార్టప్ సంస్థలు.. ఇన్వెస్టర్ల మధ్య అనుసంధాన సదస్సులు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆటా సంఘం?అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ భువనేష్ బూజాల ఇతర ఆటా నాయకులు పాల్గొన్నారు. ఐఏసీసీ చైర్మన్ శ్రీకాంత్, పాశం కిరణ్, న్యాయనిపుణులు సొమిరెడ్డి, రాణాప్రతాప్ చేగు, జయంత్, రమాదేవి, డాక్టర్ పావని తదితరులు ఈ వేడుకలకు హాజరైన వారిలో ఉన్నారు.