అమెరికా విద్యపై అవగాహన కలిగించిన ఆటా సెమినార్
అమెరికాలోని యూనివర్సిటీల్లో చేరడానికి ఆసక్తి చూపే విద్యార్థినీ విద్యార్థుల కోసం అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) హైదరాబాద్‌లో నిర్వహించిన ఎడ్యుకేషన్ సెమినార్ విజయవంతమైంది. బంజారాహిల్స్‌లో ఉన్న ముఫ్‌ఖంజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లో చదివిన ఈ సెమినార్‌కు ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా ఈ సెమినార్‌కు సహకారాన్ని అందించింది. ఈ సెమినార్‌కు ముఖ్యఅతిధిగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులర్ సెక్షన్ చీఫ్ ఎరిక్ అలెగ్జాండర్, ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు.
తెలంగాణ ఉన్నత విద్యా శాఖ చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ఆర్. లింబాద్రి కూడా ఈ?కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆటా అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ భువనేశ్ బూజాల, ట్రస్టీ జయదేవ్ చల్లా, ముఫకంజా కాలేజ్ సెక్రటరీ జాఫర్ జావెద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలు ఇంజినీరింగ్ విద్యకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో చేరే ముందు ఆ విశ్వవిద్యాలయానికి గుర్తింపు ఉందా లేదా అన్న విషయాలను తెలుసుకుని మరీ చేరాలి. ఇటీవల గుర్తింపు లేని కళాశాలల్లో చేరి చాలామంది తెలుగు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దానికితోడు నకిలీ యూనివర్సిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి యూనివర్సిటీల్లో అస్సలే చేరకూడదని వక్తలు పేర్కొన్నారు. ఈ సెమినార్‌లో భాగంగా యుఎస్ ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ అడ్వయిజర్ సుహాయిల్ ఇంతియాజ్ విద్యార్థులకు అమెరికా విద్యపై ఉన్న సందేహాలకు సమాధానాలిచ్చారు. స్టూడెంట్ వీసాకు సంబంధించిన వివరాలను కూడా తెలియజేశారు. యూనివర్సిటీలో ఆఫర్ చేసే డిగ్రీలు, ఫీజులు వివరాలను కూడా తెలియజేశారు. ఈ సెమినార్‌ను విజయవంతం చేసిన అందరికీ ఆటా నాయకులు ధన్యవాదాలు తెలిపారు.