ఆటా ఆధ్వర్యంలో మల్యాలలో ఉచిత వైద్యశిబిరం
అమెరికా తెలుగు సంఘం తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఆటా వేడుకల కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 8వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామవరం మండలం, మర్యాల గ్రామపంచాయతీలో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించింది. శ్రీమతి సుస్మిత, శ్రీనివాసబాబు ఆధ్వర్యంలో గోసుకొండ రాఘవరెడ్డి, గోసుకొండ హంసమ్మ ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వైద్యశిబిరం జరిగింది. ఈ శిబిరానికి వచ్చినవారందరికీ ఉచిత కంటి చికిత్స, దంత చికిత్సను నిర్వహించారు. అవసరం ఉన్న వారికి కంటి అద్దాలను కూడా పంపిణీ చేశారు. అలాగే అవసరమైన వారికి కాటరాక్ట్ ఆపరేషన్‌లను కూడా ఆటా ఆధ్వర్యంలోనే ఉచితంగా చేయనున్నారు. నేత్ర వైద్యనిపుణులు డా. సుమంత్ పిన్నపురెడ్డి, దంత వైద్య నిపుణులు డా. అశాంత్ మిత్రా ఆధ్వర్యంలో వచ్చినవారిని పరీక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు భువనేష్ బుజాల, ఆటా వేడుకల చైర్, మధు బొమ్మినేని, ఆటా వేడుకల కోచైర్ అనిల్ బొద్దిరెడ్డి, మరో కోచైర్ శరత్ వేముల, ఆటా రీజినల్ అడ్వయిజర్ శ్రీనివాస్ వేదుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఆటా నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను అందరికీ వివరించారు.