ఆటా ఆధ్వర్యంలో గుడిపాడు గ్రామంలో సేవా కార్యక్రమాలు
తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుడిపాడు గ్రామంలో అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గుడిపహాడ్ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు ఆటా వేడుకల కో చైర్, పాలకమండలి సభ్యుడు అనిల్ బొద్దిరెడ్డి వారి తల్లిదండ్రుల స్మారకార్థం ప్రజలకు మంచినీరు అందించాలని ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యంత్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వామ్యం కావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పిలుపునిచ్చారు.
సర్పంచ్ పాశం స్వరూప పర్వతాలు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. పుట్టిన గ్రామానికి సేవ చేయాలనే తపనతో గ్రామంలో ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని వారిని కొనియాడారు. అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను మరింతగా చేయాలని కోరారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్, ఆటా సేవాడేస్ అండ్ వేడుకల చైర్ మధు బొమ్మినేనితోపాటు పలువురు ఆటా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.