ఘనంగా జరిగిన "ఆటా" మహాసభలు
(చికాగో నుంచి చెన్నూరి వెంకట సుబ్బారావు)
చికాగో నగరంలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు జరిగిన అమెరికా తెలుగు సంఘం (ఆటా) రజతోత్సవ వేడుకలు ఆదివారంనాడు ఘనంగా ముగిశాయి. మూడురోజులపాటు ఎంతో ఉత్సాహంగా ఆటపాటలతో సందడిగా వేడుకలు జరిగాయి. సినిమా తారలు, రాజకీయ నాయకులు, బిజినెస్ ప్రముఖులు, అమెరికాలోని ప్రముఖులు ఈ మహాసభలకు హాజరయ్యారు. ఆటా మహాసభల వేడుకల్లో ఈ వారం అన్నీచోట్లా హాట్ టాపిక్ అయ్యాయి. వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులతో మూడురోజులపాటు మహాసభలు అందరినీ అలరించేలా సాగాయి. వేలాదిమంది తెలుగువారు ఒక్కచోటుకు చేరేలా ఆటా వేడుకలు జరపడంతోపాటు తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను విస్మరించకుండా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంతోమందితోపాటు, అమెరికా నలుమూలలా ఉన్న వేలాదిమంది తెలుగువాళ్ళు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. కార్యక్రమాలను కేంద్రమంత్రి ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించి తెలుగు భాషలోని గొప్పదనాన్ని చెప్పడంతోపాటు అందతూ తెలుగులోనే మాట్లాడాలని కోరారు. తానా మాజీ అధ్యక్షుడు మోహన్ నన్నపనేనిని సామాజిక సేవా పురస్కారంతో సన్మానించారు. మాజీమంత్రి కె. కేశవరావు ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఆకురాతి రోనిత్‌కు కూడా ఆటా యువత పురస్కారాన్ని బహూకరించారు. తెలంగాణ శాసనమండలి అధ్యక్షుడు స్వామి గౌడ్, మంత్రులు కడియం శ్రీహరి, నాయిని నరసింహారెడ్డిలను కూడా సన్మానించారు. ఎపి నుంచి వచ్చిన మంత్రి గంటా శ్రీనివాసరావును కూడా సత్కరించారు. మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ను కూడా సన్మానించారు.
ఈ మహాసభల్లో తెలంగాణ ఎంపి, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా అందరూ ఒక్కటేనని, పరిపాలనా సౌలభ్యంకోసమే రెండు రాష్ట్రాలుగా విడిపోయామని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో తెలుగువాళ్ళకోసం ఏర్పడిన ఆటా, తానా సంఘాలు ఎన్నో సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రపంచంలోని తెలుగువాళ్ళంతా ఒక్కటే అని చాటుతున్నారని ప్రశంసించారు. అమెరికాలో పుట్టిన తెలుగువాళ్ళు తెలుగు సంస్కృతిని, గొప్పదనాన్ని ఏమాత్రం మరచిపోకూడదని చెప్పారు. చివరిలో ఆమె జై తెలంగాణ, జై ఆంధ్ర అంటూ నినాదాలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ మహాసభల్లో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలతో ఓ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో పలు రాజకీయ అంశాలను చర్చించడంతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సెమినార్‌ను కూడా జరిపారు. ప్రముఖ అవధాన పండితుడు నరాల రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనం సాహిత్య కార్యక్రమాల్లో ప్రత్యేకంగా కనిపించింది.
ముగింపు కార్యక్రమంలో వ్యాపారరంగ ప్రముఖులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిఎంఆర్ అధినేత గ్రంథి మల్లిఖార్జునరావుకు జీవన సాఫల్య పురస్కారాన్ని చివరిరోజున బహూకరించారు. ఆటా అధ్యక్షుడు సుధాకర్ పెర్కరి, సభల కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ రెడ్డి పాల్వాయి తదితరులు ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. తెలుగు సినీ నటుడు జగపతిబాబును కూడా ఆటా సభ్యులు ఘనంగా సత్కరించారు. తెలుగు సినీరంగానికి జగపతిబాబు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ సన్మానం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆటా మహాసభల్లో వంశీ అవార్డులను కూడా ప్రదానం చేశారు. జయంతి సుబ్బారావు, వినోద్ కోడూరు, కట్టమంచి ఉమాపతి రెడ్డి, సుందర్ దిట్టకవి, ఇఫ్తెకర్ షరీఫ్, రమానాథ్ కందాళ, శ్రీమతి ప్రసన్న రెడ్డి, శ్రీమతి స్వాతి (అట్లూరి) గుండపువీడి, చింతం సుబ్బారెడ్డి, హనుమంత రెడ్డి-శ్రీమతి సునీతకు, రామరాజ యలవర్తి, రమణమూర్తి యడవల్లి, దామరాజు లక్ష్మీ, శ్రీమతి కమల చిమట, రత్నం చిట్టూరి, డా. ప్రేమ్‌సాగర్ రెడ్డి, తాతా ప్రకాశం, హేమలత బుర్ర, రాజు చామర్తి, సందీప్ భరద్వాజ్‌కు వంశీ అవార్డులను ప్రదానం చేశారు. ఆటాకు గత 25 సంవత్సరాల నుంచి అధ్యక్షులుగా పనిచేసినవారికి కూడా అవార్డులను ఇచ్చారు.
ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీత విభావరి అందరినీ ఎంతో ఆకట్టుకుంది. సినీరంగం నుంచి పలువురు కళాకారులు చేసిన ప్రదర్శనలు మహాసభలకు ఉత్సాహాన్ని తెచ్చిపెట్టాయి.
ఆటా తదుపరి అధ్యక్షుడిగా కరుణాకర్ అసిరెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మహాసభలకు భూమన కరుణాకర్ రెడ్డి, జయరామ్ కోమటి, పైళ్ల మల్లారెడ్డి తదితరులు హాజరయ్యారు.