అమెరికన్ తెలంగాణ మహాసభల్లో ఆకట్టుకున్న వివిధ కార్యక్రమాలు
హ్యూస్టన్‌లో అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 2వ ప్రపంచ తెలంగాణ మహాసభల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేడులు జరుగుతున్న జార్జ్ ఆర్.బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్ ప్రాంగణం తెలంగాణ ఆట, పాటలతో సందడిగా మారింది. కార్యక్రమానికి తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీలు జితేందర్ రెడ్డి, సీతారాం నాయక్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మహిళలు ఏర్పాటు చేసిన బతుకమ్మ, బోనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ బతుకమ్మల పాటలు, కోలాటం, కూచిపూడి, భరత నాట్యం, అలయ్-బలయ్, తదితర సాంస్క తిక కార్యక్రమాలు ప్రత్యేకత చాటుకున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయ ప్రదర్శనలు ప్రత్యేక ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
వేడుకల్లో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో చోటు చేసుకున్న సంఘటనలను గుర్తు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలను ముందు తరాలకు అందించాలని ఆటా తెలంగాణ చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. అమెరికా తెలంగాణ అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలు ప్రపంచ దేశాల్లో ఉన్నతెలంగాణ వారు గర్వపడేలా ఉన్నాయని కొనియాడారు. అమెరికాలో ఉంటూ తెలంగాణ పేరును ఖండాంతరాల్లో కీర్తిస్తున్న అమెరికా తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధుల కషిని ఎంపీ జితేందర్ రెడ్డి కొనియాడారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రముఖ కవి సినారేకు అంకితమివ్వడం పట్ల నిర్వాహకులను ఆయన అభినందించారు. ఎన్నారైలు ఎక్కడున్నా.. పుట్టిన ప్రాంతంపై ప్రేమ ఉంటుందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ముందు తరాలకు అందించాలనే ఆటా తెలంగాణ నాయకుల ప్రయత్నాన్ని ఎంపీ సీతారాం నాయక్ ప్రశంసించారు. వారు చేస్తున్న కృషిని దేశమంతా గర్విస్తుందన్నారు. మహాసభల్లో రైతు సంక్షేమానికి సంబంధించిన అంశాలను ప్రదర్శించడం అభినందనీయమన్నారు.