ఘనంగా ముగిసిన ఆటా తెలంగాణ మహాసభలు
అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో ప్రపంచ తెలంగాణ మహాసభలు మూడు రోజులపాటు కోలాహలంగా సాగాయి. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్‌లో జరిగిన ఈ మహాసభలు తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాయి. తెలంగాణ పిండివంటలు, భద్రాద్రి రాములోరి వివాహవేడుక, తెలంగాణ ఆటపాటలతో అమెరికాలోని ప్రవాసులతోపాటు, ప్రపంచ వ్యాప్తంగా 18 దేశాల నుంచి హాజరైన అతిథులు ఆకట్టుకునేలా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, సీతారాంనాయక్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ హాజరయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ, ఐటీపాలసీ, ప్రాజెక్టు నిర్మాణం, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలపై చర్చాగోష్ఠి జరిగింది. ఆడాప్ట్ ఏ విలేజ్ పేరుతో తెలంగాణలోని గ్రామాలను దత్తత తీసుకోని వందశాతం అక్షరాస్యతకు కృషిచేసే యజ్ఞంలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని తెలంగాణ ఐటీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్‌కుమార్ మక్తాల కోరారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన వారికి ఆటా తెలంగాణ చైర్మన్ కరుణాకర్‌రావు మాధవరం, అధ్యక్షుడు సత్య నారాయణరెడ్డి కందిమల్ల, కన్వీనర్ బంగార్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.