రుద్రక్రమార్చనలో పాల్గొన్నకేసీఆర్
అయుత చండీ యాగం రెండవరోజు సాయంత్రకాల పూజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దంపతులు హాజరయ్యారు. ముందుగా యాగశాలలో రుత్విజులకు ముఖ్యమంత్రి అభివాదం చేశారు. శివపార్వతుల విగ్రహాల దగ్గర రుద్రక్రమార్చనలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మంగళహారతి కార్యక్రమం, చతుర్వేద పారాయణం జరిగాయి. ధార్మిక ప్రవచనంలో భాగంగా యాగమహిమ, దత్త జయంతి విశేషాలు పురాణం మహేశ్వరశర్మ సవివరంగా ఆహుతులకు తెలియజేశారు. మరోసారి హారతి కార్యక్రమం ముగిసిన తర్వాత కార్యక్రమం చండీ విగ్రహం దగ్గర జరిగింది. లలితా నామావళి, కోటి నవాక్షరీ పురశ్చరణ, విశేష పూజ ఆశ్లేషాబలి. అష్టవధర సేవ జరిగాయి. మొదటిరోజు మాదిరిగానే శ్రీరామ లీల హరికథా కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్పీకర్ మధుసూధనచారి, డిప్యూటి స్పీకర్ పద్యా దేవేందర్ రెడ్డి, మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపిలు సీతారాం నాయక్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతు నెహ్రు, పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు, ఎన్.టి.వి భక్తి టివి చైర్మన్ టి. నరేంద్ర చౌదరి పాల్గొన్నారు.