అయుత మహా చండీయాగంలో ముగిసిన మొదటి కత్రువు
రాష్ట్ర సుభిక్షాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అయుత మహా చండీయాగం మొదటి క్రతువు పూర్తి అయింది. మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో అయుత మహా చండీయాగం ఉదయం ప్రారంభమైంది. నిర్ణయించిన ముహూర్తమైన 8:30 నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. రుత్వికులు, బ్రాహ్మణులు, నిర్వాహకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. యాగశాలకు వచ్చిన ఆయనకు వేద మంత్రోచ్చరణ, మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రుత్వికులతో కలిసి ముఖ్యమంత్రి దంపతులు యాగశాల ప్రదక్షిణ చేశారు. గురు ప్రార్ధనతో చండీమాత విగ్రహం ముందు మొదటిరోజు కార్యక్రమం ప్రారంభమైంది. గవర్నర్ దంపతులు, సీఎం దంపతులు పూజలో పాల్గొన్నారు. గణపతి మహాపుజ, మహాసంకల్పం, నిర్వహించారు. మహిళలు సాముహిక కుంకుమార్చన చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో వేద పండితులు, రాజకీయ ప్రముఖులు రావడంతో ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు.