భద్రాద్రిలో ఘనంగా బాలోత్సవం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో డిసెంబర్ 19,20 తేదీల్లో జరిగిన జాతీయ స్థాయి భద్రాద్రి బాలోత్సవం వేడుకలు ఘనంగా ముగిశాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన చిన్నారులు తమ ఆటపాటలతో మురిపించారు. బాలల పండగకు విశేష స్పందన లభించింది. సుమారు 2 వేల మంది చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. దేవుళ్ల వేషధారణలు, సంప్రదాయ, పాశ్చాత్య నృత్యాలు మేధోశక్తిని పెంపొందించే క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, సృజనకు అద్దం పట్టే మిమిక్రీ జబర్దస్త్ షో, నవ్వుల హరివిల్లు ఇలా అన్ని రకాల అంశాల్లో చిన్నారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్ట్, తానా, ఆటా, ఐటిసి పిఎస్‌పిడి, తెలంగాణ సాంస్కృతిక మండలి, బూసిరెడ్డి అన్న పూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతియ స్థాయి బాలోత్సవ వేడుకలు చిన్నార్లులోని ప్రతిభను వెలికితీశాయి. జెడ్పీ మాజీ చైర్మన్ చేకూరి కాశయ్య చిన్నారుల ప్రతిభ పాటవాలకు అచ్చెరువొందారు. జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎంపి సీతారామ్‌నాయక్, తాళ్లూరి పంచాక్షరయ్య, తాళ్లూరి జయశేఖర్, బూసిరెడ్డి శంకర్‌రెడ్డి, పాకాల దుర్గాప్రసాద్, చాలా లక్ష్మినారాయణ, బెక్కంటి శ్రీనివాసరావు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి పంచాక్షరయ్య, తాళ్లూరి రాజా శ్రీకృష్ణ, తాళ్లూరి ట్రస్ట్ డైరెక్టర్ జయశేఖర్, ఎన్‌ఆర్‌ఐలు దొడ్డపనేని హరినాథ్, రాథ, ఆళ్ల రాధ, తానా ప్రతినిధి బత్తినేని రాకేష్, జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత, బాలోత్సవ్ కన్వీనర్ బెక్కంటి శ్రీనివాస్, ఎంఈవో జయరావు తదితరులు పాల్గొన్నారు.
మొదటిరోజున...
దేశ భవిష్యత్తు నేటి బాలలపైనే ఆధారపడి ఉందని ఎమ్మెల్యే సున్నం రాజయ్య తెలిపారు. ఇప్పుడు నేర్చుకున్న విలువలే చిన్నారులకు ఉన్నతంగా తీర్చిదిద్దుతాయన్నారు. మొదటిరోజు స్థానిక బీఎస్సార్ ఫంక్షన్ ప్యాలెస్‌తో పాటు దానికి పక్కనే ఉన్న శుభం ఫంక్షన్ హాళ్లలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలన వేడుకను పంచింది. ఈ సందర్భంగా ఉత్సవాల కన్వీనర్ బెక్కంటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగి సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందని ఇలాంటి వేదికల ద్వారా అంతర్గత శక్తులను వెలికి తీసి దేశం గర్వించే స్థాయికి ఎదగాలన్నారు. తానా ఫౌండేషన్ ట్రస్టీ తాళ్లూరి జయశేఖర్ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి జీవితం మరో కోటి మందికి వెలుగును అందించే స్థాయిలో ముందుకు సాగాలన్నారు. తానా సభ్యులు డా.రాజా శ్రీకృష్ణ మాట్లాడుతూ ఈ ఉత్సవం వేలాది చిరు మెదళ్లను చైతన్యవంతం చేసేలా ఉందన్నారు. సుదూర ప్రాంతం నుంచి వచ్చినపటికీ ఇక్కడి చిన్నారులను చూస్తే ప్రయాణ బడలిక మాయమై నూతనోత్సాహం వచ్చిందన్నారు. భవిష్యత్తులో కూడా బాలోత్సవం నిర్వహణకు తమ కుటుంబం తరపున కృషి చేస్తామన్నారు. నైతిక విలువలతో కూడిన భోధనను ఇలాంటి సంబరాల ద్వారా చిన్నారులు నేర్చుకుంటారని ఉత్సవాల అధ్యక్షుడు తాళ్లూరి పంచాక్షరయ్య తెలిపారు. ఆరోసారి జరుగుతున్న బాలోత్సవానికి తెలంగాణ, ఆంధ్ర, పశ్చిమ బంగా, మహారాష్ట్ర నుంచి 10 వేల మంది విద్యార్థులు రావడం ఆనందంగా ఉందని కన్వీనర్ బెక్కంటి తెలిపారు. వచ్చిన వారందరికీ భోజన, వసతి సదుపాయాలు కల్పించామని వల్లూరిపల్లి వంశీకృష్ణ తెలిపారు. అమెరికా నుంచి ఇక్కడి వేడుకలను చూసేందుకు వచ్చామని తాళ్లూరి శ్రీపూజ, శ్రీప్రియా తెలిపారు. బూసిరెడ్డి, శంకర్‌రెడ్డి, బలరాం చౌదరి, రామాలయం ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు, చావా లక్ష్మీనారాయణతో పాటు పలు సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.
బాలోత్సాహం...నూతనోత్సాహం
భద్రాచలంలో జరిగిన బాలోత్సవం చిన్నారుల్లో నూతన ఉత్తేజాన్ని నింపేలా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఉత్సవాల ద్వారా వివిధ ప్రాంతాల మధ్య ఉన్న విద్యార్థులు ఒకే వేదికమీదకు రావడంతోపాటు వారి మధ్య స్నేహభావం?పెరిగేందుకు ఈ ఉత్సవాలు దోహదం?చేస్తున్నాయి. వివిధ రకాల కళల్లో తమ ప్రతిభను చాటేందుకు రకరకాల వేషధారణలతో వచ్చిన విద్యార్థులతో ఉత్సవాలు జరిగిన రెండురోజులు ప్రాంగణం కళకళలాడింది. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సైతం బాలోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమాలు కూడా వివిధ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టేలా సాగాయి. వ్యాసరచన పోటీలు, కూచిపూడి నృత్యం భరతనాట్యం, పేరిణి నృత్యం, చిత్రవిశ్లేషణ, బొమ్మలు గీయడం, చిత్రంతో కథారచన ఇలా వివిధ అంశాలపై పోటీలను నిర్వహించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఎంతోమంది వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు.