అక్టోబర్ 22న బే ఏరియాలో ‘బాటా’ స్వర్ణోత్సవాలు
బే ఏరియాలోని తెలుగువారికి విశేషంగా సేవలందిస్తున్న బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) స్వర్ణోత్సవ సంబరాలకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 22వ తేదీన శాంతాక్లారాలోని శాంతాక్లారా కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ 50వసంతాల వైభవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి వీలుగా బాటా ఇటీవల నిర్వహించిన సన్నాహక సమావేశం విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది దాతలు తమవంతుగా విరాళాలను అందించి వేడుకల నిర్వహణకు తోడ్పాటును అందిస్తున్నారు. బాటా ప్రస్తుత పాలకవర్గంతోపాటు గతంలో బాటాకు సేవలందించిన ఎంతోమంది ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. కమ్యూనిటీతో ఐదు దశాబ్దాలపాటు ఎంతోసేవలందించడంతోపాటు తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని పరిరక్షించేందుకు వీలుగా ఎన్నో కార్యక్రమాలను బాటా నిర్వహించింది.
బే ఏరియాలోని తెలుగు చిన్నారుల కోసం తెలుగు పాఠశాలను తానాతో కలిసి నిర్వహిస్తోంది. జాతీయ తెలుగుసంఘాల మహాసభల్లో కూడా కీలకపాత్రను పోషిస్తోంది. 1994లో ఆటా కాన్ఫరెన్స్‌లో, 2003లో తానా కాన్ఫరెన్స్‌లో, 2011లో తానా కాన్ఫరెన్స్‌లు వైభవంగా జరగడంలో బాటా కీలకపాత్రను పోషించింది. ఇవే కాకుండా ఎన్నో కార్యక్రమాలను, సేవలను కమ్యూనిటీకి అందిస్తున్న బాటా ఈ స్వర్ణోత్సవ వేళలో మరింతగా కార్యక్రమాలను నిర్వహించి కమ్యూనిటికీ మరోసారి సేవలందించేందుకు ముందుకు వస్తోంది. ఈ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని బే ఏరియా తెలుగు సంఘం నాయకులు కోరుతున్నారు. ఈ వేడుకలకు ‘తెలుగుటైమ్స్’ మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది.