ASBL Koncept Ambience

భళా అనిపించిన బాటా సంక్రాంతి వేడుకలు

భళా అనిపించిన బాటా సంక్రాంతి వేడుకలు

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా) సంక్రాంతి వేడుకలను ఈ సంవత్సరం మరింత కోలాహలంగా అంగరంగవైభవంగా నిర్వహించింది. వంటల పోటీలు, ముగ్గుల పోటీలు, పాటల పల్లకితో ఈ సంక్రాంతి వేడుకలు కనువిందు చేశాయి. దాదాపు 1,000 మంది హాజరైన ఈ వేడుకల్లో సినిమా పాటలు, శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు, స్టేజ్‌ గేమ్‌ షోలు వంటివి ఏర్పాటు చేశారు. టాలీవుడ్‌ సింగర్‌ అంజనా సౌమ్య సంగీత విభావరి అలరించింది.

సంక్రాంతి వేడుకలు జరిగిన ప్రాంతాన్ని పండుగ వాతావరణం ఉట్టిపడేలా బాటా వలంటీర్లు తీర్చిదిద్దారు. పాటల పల్లకితో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బాటా కరవొకె టీమ్‌ సభ్యులు పాడిన మధురగీతాలు, శాన్‌రామన్‌ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన హాస్యనాటిక అనుకున్నది ఒకటి అయినది ఒకటి నవ్వించింది. వంటల పోటీలు, రంగవల్లి పోటీలు, డ్రాయింగ్‌ పోటీలు, వ్యాసరచన పోటీల్లో పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. వంటల పోటీల్లో పాల్గొన్న చిన్నారులు తమ ఇంటి నుంచి వంటకు అవసరమైన సామాగ్రితో సొంతంగా చేసిన వంటకాలు అహో అనిపించాయి. రంగవల్లి పోటీలు ఊరిని గుర్తు చేశాయి. సాయంత్రం?5 గంటలకు బాటా సలహాదారు విజయ ఆసూరి సాంస్కృతిక వేడుకలను ప్రారంభించారు. భోగిపళ్ళు కార్యక్రమం తొలుత జరిగింది. చిన్నారులకు తల్లితండ్రులు, తాతయ్యలు అమ్మమ్మలు, నాయనమ్మలు భోగిపళ్ళను పోశారు. పెద్ద కుటుంబంలో సాగిన వేడుకగా ఈ కార్యక్రమం జరిగింది. గొబ్బెమ్మల నాట్యం ఆకట్టుకుంది.

అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌ (ఎఐఎ) కూడా ఈ వేడుకల్లోనే రిపబ్లిక్‌ వేడుకలను నిర్వహించింది. ప్రజాప్రతినిధులు ఈ వేడుకకు హాజరై భారతీయులకు శుభాకాంక్షలు చెప్పారు. కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ టండియా అంబాసిడర్‌ సంజయ్‌ పాండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఫ్రీమాంట్‌ మేయర్‌ లిలి మే, రాజ్‌ సల్వాన్‌ (వైస్‌ మేయర్‌, ఫ్రీమాంట్‌), సూపర్‌ వైజర్‌ డేవ్‌, శాంతాక్లారా కౌన్సిల్‌ మెంబర్‌ రాజ్‌ చహల్‌తోపాటు జయరామ్‌ కోమటి తదితర ప్రముఖులు, ఎఐఎ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిన్నారులు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు, పాటలు అలరించాయి. వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన విజయ నగర సామ్రాజ్య స్థాపన చారిత్రాత్మక నాటిక హైలైట్‌గా నిలిచింది. డా. రవినరాలసెట్టి రచించి దర్శకత్వం?వహించిన ఈ నాటికలో బాటా నాయకులు కూడా కీలకపాత్రను పోషించారు. టాలీవుడ్‌ సూపర్‌ హిట్‌సాంగ్స్‌కు బాటా యువ టీమ్‌ చేసిన డ్యాన్స్‌లు అందరినీ మెప్పించాయి. శాన్‌హోసె, కుపర్టినో, ఫ్రీమాంట్‌, శాన్‌రామన్‌ తదితర చోట్ల ఉన్న చిన్నారులకు బాటా నాయకులు డ్యాన్స్‌ విభాగంలో శిక్షణ ఇప్పించి ఈ కార్యక్రమంలో వారిచేత ప్రదర్శనలిప్పించారు. టాలీవుడ్‌ పాటల గాయని అంజనా సౌమ్య 70వ దశకంలోని పాటల నుంచి నేటి వరకు హిట్టయిన ఎన్నో పాటలను పాడి అందరినీ పరవశింపజేశారు.

ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడానికి ఎంతోమంది స్పాన్సర్లు సహకరించారు. అసోసియేట్‌ స్పాన్సర్‌గా సంజయ్‌ ట్యాక్స్‌ ప్రో, పవర్‌డ్‌ బై స్పాన్సర్‌గా యు స్మైల్‌ డెంటల్‌, గ్రాండ్‌ స్పాన్సర్‌గా పిఎన్‌జి జ్యూవెల్లర్స్‌, ప్లాటినమ్‌ స్పాన్సర్‌గా రియల్టర్‌ శ్రీనిగోలి, గోల్డ్‌ స్పాన్సర్‌గా ఎపెక్స్‌ కన్సల్టింగ్‌ వ్యవహరించారు. పాఠశాల, ఆజాద్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, రియల్టర్‌ సాగర్‌ కోట, ఎఓపిఎస్‌ అకాడమీ, రియల్టర్‌ ఐశ్వర్య కోనేరు కూడా స్పాన్సర్లుగా ఉన్నారు. మిస్టర్‌బిర్యానీజ్‌ ఫుడ్‌ స్పాన్సర్‌గా వ్యవహరించింది. మీడియా పార్టనర్లుగా విరిజల్లు తెలుగు రేడియో, తెలుగు టైమ్స్‌ ఉన్నాయి.

బాటా అధ్యక్షుడు యశ్వంత్‌ కుదరవల్లి (ప్రెసిడెంట్‌) వేడుకను విజయవంతం చేసిన బాటా టీమ్‌ను, వలంటీర్లను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన బాటా టీమ్‌ను అందరికీ పరిచయం చేశారు. హరినాథ్‌ చికోటి (వైస్‌ ప్రెసిడెంట్‌), సుమంత్‌ పుసులూరి (సెక్రటరీ), కొండల్‌రావు (ట్రెజరర్‌), అరుణ్‌ రెడ్డి (జాయింట్‌ సెక్రటరీ), స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రవి తిరువీధుల, కామేష్‌ మల్ల, కళ్యాణ్‌ కట్టమూరి, శిరీష బత్తుల, కల్చరల్‌ డైరెక్టర్‌లు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి, నామినేటెడ్‌ కమిటీ సభ్యులు ప్రశాంత్‌ చింత, వరుణ్‌ ముక్క, హరి సన్నిధిని పరిచయం చేశారు.

బాటా అడ్వయిజరీ బోర్డ్‌ సభ్యులు జయరామ్‌ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్‌ మంగిన, కరుణ్‌ వెలిగేటి, రమేష్‌ కొండ వేడుకను విజయవంతం చేసిన బాటా టీమ్‌ను ప్రశంసించారు.

స్పాన్సర్లకు మరోసారి బాటా టీమ్‌ ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా బాటా చేసే కార్యక్రమాలకు సహాయపడాలని కోరింది.

Click here for Event Gallery 

Tags :