విభిన్నమైన పోటీలు.. వినూత్న షోలతో ఆకట్టుకున్న బాటా సంక్రాంతి
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో జనవరి 17వ తేదీన సన్నివేల్ హిందూ టెంపుల్‌లో సంక్రాంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు. ఈసారి జరిగిన సంక్రాంతి పోటీలకు ప్రత్యేక ఆకర్షణగా కీరవాణి పాటల పోటీలు, ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, బొమ్మల కొలువు, పాటల పల్లకి వంటివి నిలిచాయి. వీటితోపాటు స్టేజి గేమ్ షోలు, డ్యాన్స్‌లు అదరగొట్టేశాయి. మొత్తం మీద సంక్రాంతి వేడుకలను తిలకించడానికి వచ్చిన దాదాపు 1000 మంది అతిధులు కార్యక్రమాలను బాగా ఎంజాయ్ చేయడం విశేషం.
బాటా ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమానికి తగ్గట్టుగా ఏర్పాట్లను ముందు నుంచే చేస్తుంది. ఈసారి కూడా బాటా టీమ్ సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని స్టేజిపై సంక్రాంతి వాతావరణం కనిపించేలా ఏర్పాట్లు చేసింది. బే ఏరియాలో జనవరి 23వ తేదీన సంగీత దర్శకుడు కీరవాణి సంగీత విభావరిని పురస్కరించుకుని ఈ వేడుకల్లో కీరవాణి పాటలను ప్రత్యేక ఆకర్షణగా చేసింది. కీరవాణి పాటల పోటీల్లో దాదాపు 50 మందికిపైగా గాయనీగాయకులు పాల్గొన్నారు. అన్నీ వయస్సుల వారు ఇందులో పాల్గొని తమ గాన ప్రతిభను నిరూపించుకున్నారు. టాలీవుడ్ సింగర్ సాహితీ పైడిపల్లి ఈ పోటీలకు ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. రవి, మానస, కీర్తి జడ్జీలుగా వ్యవహరించారు. శ్రీలు, శ్రీదేవి పోటీలను సమన్వయపరిచారు. 24 మంత్ర ఆర్గానిక్ ఫుడ్స్ దీనికి స్పాన్సర్‌గా వ్యవహరించింది.
పెద్దల కోసం, చిన్నారుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన వంటల పోటీలు, రంగురంగుల ముగ్గుల పోటీల్లో కూడా ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలామంది వంటకు అవసరమైన సామాగ్రిని తమ ఇంటి నుంచి తీసుకుని వచ్చి తమ పాకనైపుణ్యాన్ని చాటారు. కిడ్స్ కూడా వంటల పోటీల్లో పాల్గొనడం ఆకర్షించింది. సుమంత్, కొండల్, ప్రశాంత్ వంటల పోటీలను పర్యవేక్షించారు. వినయ్ (బిర్యాని), ప్రశాంత్ (లోటస్), శ్రీనివాస్ జడ్జీలుగా, రంగవల్లి పోటీలకు కృష్ణ ప్రియ, మాధవి, హరినాథ్ కో ఆర్డినేటర్లుగా వ్యవహరించారు.
బే ఏరియా తెలుగు అసోసియేషన్, తెలుగు టైమ్స్ సంయుక్తంగా తెలుగు భాష పరిరక్షణలో భాగంగా నిర్వహిస్తున్న 'పాఠశాల'కు చెందిన చిన్నారులు ఈ వేడుకల్లో తమ ప్రతిభను అన్నీ రంగాల్లో ప్రదర్శించి భళా అనిపించారు. పాటలు, పద్యాలు, నాటికలు, నృత్యాల్లో వారు చూపిన ప్రతిభ అందరినీ మైమరపింపజేసింది. బే ఏరియాలో ఐదు చోట్ల దాదాపు 250 మందికిపైగా విద్యార్థులతో పాఠశాల దిగ్విజయంగా నడుస్తున్న సంగతి తెలిసిందే.
సాయంత్రం 5.30కు ప్రధాన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. బాటా సలహాదారు విజయ ఆసూరి తొలుత సాంప్రదాయకంగా చిన్నపిల్లలను స్టేజిపైకి ఆహ్వానించి భోగిపళ్లను పోయడం ద్వారా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులతోపాటు వారి తల్లితండ్రులు, తాతయ్యలు, నాయనమ్మలు పాల్గొని తమది వసుధైకకుటుంబమని తెలియజేశారు.
నిత్యానంద డ్యాన్స్ (హిమబిందు చల్లా) విద్యార్థులు శాస్త్రీయ నృత్యరూపకాన్ని, ఏరో డ్యాన్స్ గ్రూపు (రంజని మంద) టాలీవుడ్ డ్యాన్స్‌లను, ఆట్టం గ్రూపు (సూపర్‌మాచి) విద్యార్థులు చేసిన నృత్యాలతో కార్యక్రమాలు ఉత్సాహాన్ని రేకెత్తించాయి.
పాటల పల్లకి కార్యక్రమంలో కొత్త-పాతల మేలు కలయికతో పాడిన పాటలు అహో అనిపించాయి. ప్రసాద్ మంగిన ఈ కార్యక్రమాన్ని సమన్వయపరచడంతోపాటు సింగర్లను అందరికీ పరిచయం చేశారు. డా. రమేష్ ప్రత్యేక అతిధులను ఆహ్వానించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్ అధికారి వెంకటరమణను, ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన డా. కార్ల్ వాంగ్‌ను వేదికపైకి ఆహ్వానించారు. వారంతా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలను తెలుపుతూ బాటా చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు.
స్టేజిపైన నిర్వహించిన ఆడియో-వీడియోతో చేసిన క్విజ్ కార్యక్రమం ఆకట్టుకుంది. కళ్యాణ్, విజయ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రవి ట్యాక్స్ సర్వీసెస్, కాల్‌హోమ్స్ ఈ కార్యక్రమానికి గ్రాండ్ స్పాన్సర్స్‌గా వ్యవహరించారు. యు స్మైల్ డెంటల్, లావణ్య దువ్వి, స్వాగత్ ఇండియన్ కుజిన్, స్కోపస్ కన్సల్టింగ్ గ్రూపు, ఇంటర్నేషనల్ టెక్నాలజీ యూనివర్సిటీ (ఐటీయు), నితిన్ జూవ్వెల్లర్స్, 24 మంత్ర కూడా ఈ వేడుకలకు స్పాన్సర్లుగా ఉన్నాయి. విరిజల్లు రేడియో, దేశీ 1170 ఎఎం, తెలుగు టైమ్స్, టీవీ 9, టీవీ ఏసియా ఈ వేడుకలకు మీడియా స్పాన్సర్లుగా వ్యవహరించాయి.
బాటా ప్రెసిడెంట్ కళ్యాణ్ కట్టమూరి వేడుకలను విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. బాటా ఎగ్జిక్యూటివ్ టీమ్‌ను ఆయన ఈ సందర్భంగా అందరికీ పరిచయం చేశారు. శిరీష బత్తుల (వైస్ ప్రెసిడెంట్), యశ్వంత్ కుదరవల్లి (సెక్రటరీ), సుమంత్ పుసులూరి (ట్రెజరర్) హరినాథ్ చికోటి (జాయింట్ సెక్రటరీ) పరిచయం చేశారు. స్టీరింగ్ కమిటీకి చెందిన రవి తిరువీధుల, కామేష్ మల్ల, కల్చరల్ కమిటీకి చెందిన శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, కిరణ్ విన్నకోట, తారక దీప్తి, లాజిస్టిక్ కమిటీ సభ్యులు శ్రీకర్ బొడ్డు, నరేష్ గాజులు, అరుణ్ రెడ్డి, ప్రశాంత్ చింత, కొండల్‌రావు తదితరులు ఈ వేడుకల విజయవంతానికి సహకరించారు. బాటా అడ్వయిజరీ బోర్డు సభ్యులు జయరామ్ కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, రమేష్ కొండ, కరుణ్ వెలిగేటి తదితరులు వేడుకలను విజయవంతంగా నిర్వహించినందుకు బాటా టీమ్‌ను అభినందించారు. వేడుకలు నిర్వహించడంలో సహకరించిన సన్నివేల్ హిందూ టెంపుల్ మేనేజ్‌మెంట్‌కు కూడా బాటా కమిటీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది.