వివిధ నగరాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పిట్స్‌బర్గ్‌లో..
పిట్స్‌బర్గ్ నగరంలో బతుకమ్మ పండుగను ఎన్నారై మహిళలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఈ వేడుకల్లో 350 మందికిపైగా తెలంగాణ ఆడపడచులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దారు. వాటి చుటూ ఎంతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ సందడిగా గడిపారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి.. మలీదా ప్రసాదాన్ని పంచుకున్నారు. అందంగా అలంకరించిన బతుకమ్మలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను నిర్వాహకులు అందించారు. అనంతరం అందరూ పసందైన తెలంగాణ వంటకాలను ఆరగించారు. తెలంగాణ కుటుంబాలు ఇలా ఒకే చోట కలుసుకొని పండుగ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న వారందరూ అభిప్రాయ పడ్డారు. ఇక ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి, వాలంటీర్లకు, స్పాన్సర్లకు కన్వీనర్లు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆస్టిన్‌లో..
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలను టెక్సాస్ రాజధాని అస్టిన్ నగరంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు ఈ వేడుకల్లో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి పూజలు చేశారు. మహిళలు, యువతులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ఈ వేడుకలను విజయవంతం చేసిన వారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
అట్లాంటాలో..
జార్జియా రాష్ట్ర రాజధాని అట్లాంటాలో ఎన్‌ఆర్‌ఐలు రూపురెడ్డి మనోరంజన్ రెడ్డి, గుడిపాటి శైలజ కుమారి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలు హాజరై అమ్మవారికి పూలతోటి అలంకరణ చేసి బతుకమ్మ జానపద గీతాలు భక్తిశ్రద్ధలతో ఆలపించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మహిళలు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢల్లీి) జాతీయ ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు హాజరై అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రూపురెడ్డి మనోరంజన్ రెడ్డి, గుడిపాటి శైలజ కుమారి, జాస్తి మేఘన నరేంద్ర, శాంత, పద్మ,ప్రీతి, లక్ష్మీ శైలజ, అమిత, ప్రసన్న, నేహా, నిఖి,సర తదితరులు పాల్గొన్నారు.
కాన్సస్‌లో..
కాన్సస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సస్ సిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక హిందూ దేవాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 3 వేల మంది తెలుగు వారు పాల్గొన్నారు. మొదట అమ్మవారికి టీఏజీకేసీ అధ్యక్షులు నరేంద్ర దూదేళ్ల దంపతులతో దేవాలయ పూజారి శ్రీనివాసాచారి పూజలు నిర్వహించారు. ఈ సంబరాలకు వ్యాఖ్యాతగా రేణు శ్రీ వ్యవహరించి ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా వేడుకలను నడిపించారు. మహిళలంతా సంప్రదాయ దుస్తులను ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి ఈ సంబరాల్లో పాల్గొన్నారు.
తెలంగాణ జానపద, బతుకమ్మ పాటలకు అందరూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. బతుకమ్మను తయారుచేసి తీసుకొచ్చిన వారికి రాఫెల్ టికెట్స్ ఇచ్చి.. గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. బతుకమ్మను అందంగా పేర్చిన ఎనిమిది మందికి చీరెలను బహూకరించారు. బతుకమ్మ నిమజ్జనం అనంతరం విందుభోజనాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు విజయవంతంగా జరగడానికి సహకరించిన కార్యకర్తలు, స్పాన్సర్స్‌కి టీఏజీకేసీ అధ్యక్షులు నరేంద్ర దూదేళ్ల, ఉపాధ్యక్షులు చంద్ర యక్కలి, ట్రస్ట్ బోర్డ్ చైర్‌పర్సన్ శ్రీధర్ అమిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ, ట్రస్ట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
హ్యూస్టన్‌లో..
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ హ్యూస్టన్ ఆధర్యంలో హ్యూస్టన్ నగరంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. సుగర్‌ల్యాండ్ మెర్సర్ మైదానంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పిల్లలు, పెద్దలు అంతా కలిసి దాదాపు 5వేల మంది సంప్రదాయబద్ధమైన వస్త్రాలు ధరించి బతుకమ్మ ఆడారు. ఆటపాటలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ టిఎజిహెచ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. టిఎజిహెచ్ సంస్థకు విరాళాలు అందించిన వారికి, లోగో స్పాన్సర్లకు, మీడియా మిత్రులకు సంస్థ బోర్డు సభ్యులు, ధర్మకర్తలు, సలహాదారులు, సంస్థ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
బతుకమ్మ వేడుకల్లో మధు బొమ్మినేని
నార్త్ కరోలినాలోని రాలేలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని పాల్గొని సంప్రదాయాన్ని చక్కగా పాటిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. దాదాపు 150 మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మధు బొమ్మినేని మాట్లాడుతూ అమెరికా తెలుగు సంఘం కార్యవర్గం తరపున మహిళలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆటా ఆధ్వర్యంలో ఎన్నో నగరాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 2024 జూన్ 7 ` 9 తారీకులలో అట్లాంటాలో జరగనున్న 18వ ఆటా కన్వెన్షన్ వేడుకల్లో అందరూ పాల్గొని ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.