సమభావనకు బాట వేసిన మహనీయుడు భగవద్రామానుజులు
భగవంతుడి సృష్టిలో అందరూ సమానులేనని, అందరికీ భగవంతుని దర్శనం, మోక్షం లభించాల్సిందేనని ఆనాడే గొంతెత్తి చాటిన మహనీయుడు శ్రీ రామానుజులవారు. వెయ్యేండ్లకు పూర్వం సాంప్రదాయికంగా కొనసాగుతున్న ఆచార్య వ్యవహారాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని అంటూ తన బోధనల ద్వారా, ఆశయాల ద్వారా నాటి సమాజంలో చైతన్యం నింపి, సమానత్వ స్ఫూర్తిని చాటారు. విశిష్టాద్వైతం బోధించి భక్తి ఉద్యమాన్ని రగుల్కొల్పిన గొప్ప ఆధ్యాత్మిక విప్లవ సారథి కూడా. అట్టడుగు వర్గాలు ఆలయాల్లోకి వచ్చేందుకు వీలులేని వాతావరణం కొనసాగుతున్న సమయంలో, అంటరానితనం అడుగడుగునా కనిపిస్తున్న సమయంలో రామానుజులు సమాజంలో అంతా సమానమేనని, భగవంతుడి ముందు కులాల ప్రసక్తిలేదని ఎలుగెత్తి చాటారు. రామానుజుల మించిన మానవతామూర్తి లేరని బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అభిప్రాయపడ్డారంటే రామానుజుల వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థమవుతుంది.
శ్రీ రామానుజులు పింగళనామ (కలియుగం శాలివాహనశకం 4118, క్రీ.శ.1017) సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష పంచమి రోజున కాంతిమతి కేశవాచార్యులకు, భూతపురి నేటి శ్రీపెరంబుదూరులో (ఇది చెన్నైకి 25కిమీ దూరం) జన్మించారు. వీరిని ఆదిశేష అవతారంగా పేర్కొంటారు. తండ్రి వద్ద, కాంచీపురంలోని యాదవ ప్రకాశకుల వద్ద ఆయన విద్యాభ్యాసం జరిగింది. విద్యాభ్యాస కాలంలోనే ఆయనలోని విశిష్టాద్వైత సిద్ధాంత విశ్వాసాలు వికాసం పొందాయి. గురువుతోనే విభేదించి తన విశిష్టాద్వైత వాదాన్ని నెగ్గించుకొన్న ప్రతిభాశాలి. ఆయనకు ముందు నుంచే విశిష్టాద్వైతం ఉంది. దానిని బహుళ వ్యాప్తిలోకి తీసుకొని వచ్చినవారు రామానుజులు మాత్రమే. ఆయనకు సహజంగా ఏర్పడిన గుణాలు అప్పటికే స్థిరపడి ఉన్న విశిష్టాద్వైతానికి అనుగుణంగా ఉన్నాయని, అప్పటికి విశిష్టాద్వైతంలో ఉన్నతుడుగా ఉన్న యామునాచార్యుడు రామానుజుడిని విశిష్టాద్వైత మత ప్రవర్తకుడుగా ప్రకటించి ప్రోత్సహించాడని అంటారు.
విశిష్టాద్వైతం ప్రకారం కుల భేదం లేకుండా ఎవరైనా శ్రీమన్నారాయణుని పూజించుటకు అర్హులే. కుల భేదాలు, పట్టింపులు అధికంగా ఉన్న ఆకాలంలోనే గురువుతో విభేదించి గురుకులంలో ఇలాంటి సిద్ధాంతాన్ని ప్రకటించి తన మార్గం ఇదేనని చాటారు. అలాగే యుక్తవయసులో యామునాచార్యుల వద్ద విద్యను అభ్యసించిన అనంతరం మంత్రోపదేశం కోసం శ్రీరంగంలోని గోష్టీపూర్ణులు అనే తిరుక్కోట్టియార్ నంబి గురువును ఆశ్రయిస్తారు. తిరుక్కోట్టి యార్ నంబి యామునాచార్యుల శిష్యులలో ఒకరు. వీరు శ్రీపెరంబుదూరు నుండి శ్రీరంగం వరకు కాలినడకన రామానుజులవారిని 18సార్లు తన వద్దకు తిప్పుకుని, పరీక్షించి చివరకు ఓం నమోనారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రోపదేశం చేస్తారు. ఈ మంత్రం మోక్షప్రదాయిని కనుక రహస్యంగా ఉంచాలని గొష్టీపూర్ణులు ఆదేశిస్తారు. కానీ దాన్ని గురువు నుండి విన్న వెంటనే బయటికి వచ్చి శ్రీరంగం గుడి గోపురం పైకి ఎక్కి అందరికీ వినబడేట్లు, అందరూ ఉచ్చరించేటట్లు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఉచ్చరిస్తారు. వెంటనే పరుగున వచ్చిన గురువు నీవు నరకానికి పోతావేమో అంటే అందరికీ మోక్షం లభిస్తూంటే నేను ఒకడిని నరకానికి వెళ్లడానికైనా సిద్దం అంటారు. ఇంతకన్నా ఆధ్యాత్మిక విప్లవ భావాలను రామానుజాచార్యులు ఆనాడే పుణికిపుచ్చుకున్నారు.
రామానుజులు బ్రహ్మ సూత్రాల శ్రీభాష్యం, వేదాంత సారం, వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, శరణాగత గద్యం మొదలైన గ్రంథాలను రచించారు. దేశ వ్యాప్తంగా విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేయడానికి పలువురు సింహాసనాధిపులను, జియ్యంగార్లను, ఏకాంతులను నియమించారు. చాత్తాద వైష్ణవులూ, అమ్మంగార్లూ శ్రీ వైష్ణవ దాసులు కైంకర్యం చేసే సంప్రదాయాలను ఏర్పరిచారు. అస్పృశ్యత లాంటి దురాచారాలను తొలగించడానికి సంస్కరణాత్మక పద్ధతులను ప్రవేశపెట్టారు. తన జీవితం ద్వితీయార్ధం శ్రీరంగంలో గడిపిన రామానుజులు నూట ఇరవై సంవత్సరాలు జీవించి పుట్టిన సంవత్సరమైన పింగళలోనే మాఘ శుద్ధ దశమి శనివారం నాడు దేహ త్యాగం చేశారు.
ఇతర కులాలవారిని చేరదీసిన రామానుజుడు
అన్నీ కులాలు సమానమేనని భగవద్రామానుజులు తన జీవితంలో అడుగడునా నిరూపించారు. రామానుజుల బాల్యంలో కంచీపూర్ణుడు అనే భక్తుడు రోజూ కాలినడకన కాంచీపురం నుండి శ్రీపెరంబుదూరు మీదుగా ఎక్కడో దూరాన ఉన్న దేవాలయానికీ వెళ్ళి పూజలు చేసి వస్తుండేవారు. ఇది ప్రతిరోజూ గమనించిన రామానుజులు ఒకరోజు కంచీపూర్ణులను ఇంటికి పిలిచి భోజనం పెట్టి కాళ్లు నొక్కడానికి సిద్ధపడతారు. అంతలో కంచీపూర్ణుడు నేను నిమ్న కులస్థుడిని బ్రాహ్మణులైన మీరు నాకాళ్ళు పట్టడం తగదు అంటాడు. అంతలో రామానుజులు భగవంతుని భక్తి శ్రద్ధలతో సేవించేవారు. అందరూ తనకు గురు సమానులే అంటూ కంచీపూర్ణుల కాళ్లు పడతారు. స్వామికి ధరింపజేసే ధోవతిని చక్కగా ఉతికి తెచ్చే చాకలిని శ్రీరంగంలోని గర్భగుడిలోకి తీసుకెళ్ళి రంగనాథుని దర్శనం చేయించడం ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా సామాజిక సమానత్వానికి ఆయన ఆనాడే బాటలు వేశారు.
ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో, మార్చటమో చేయటం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రథమ కర్తవ్యమని ప్రబోధించారు. దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం , మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం వద్దని చెప్పారు. ఒక పనివల్ల పదిమందికి మేలు జరుగు తున్నప్పుడు, తమకు కీడు జరిగినా, పదిమందికి జరిగే మేలుకై, తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు.
తిరుమల ఆలయంపై రామానుజుడి ముద్ర
తిరుమలలో శ్రీనివాసుడి మూలవిరాట్ విష్ణుమూర్తి విగ్రహం కాదని, అది శివుడు లేదా అమ్మవారి విగ్రహం కావచ్చనే వాదన చెలరేగింది. చిలికి చిలికి గాలివానగా మారి, ఈ వాదన చివరికి శైవ, వైష్ణవ కలహాలకు దారి తీసింది. విషయం తెలుసుకున్న రామానుజులు తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజు దగ్గరికి వెళ్లారు. పౌరాణిక, శాస్త్ర ఆధారాలు చూపించి తన వాదనతో తిరుమలలో ఉన్నది శ్రీవారి విగ్రహమేనని నిరూపించారు. శైవులు అంతటితో సంతృప్తి చెందలేదు. ప్రత్యక్ష ప్రమాణం కావాలన్నారు. అందుకు అంగీకరించిన రామానుజులు వేంకటేశ్వరుని విగ్రహం ఎదుట బంగారంతో చేయించిన వైష్ణవాయుధాలు, శైవాయుధాలు, శక్తి ఆయుధాలు పెట్టి, విగ్రహం ఏ దైవానిదైతే ఆ ఆయుధాలను దైవం స్వీకరిస్తుందని చెప్పి గర్భాలయం తలుపులు మూసేశారు. ఆ రాత్రి అత్యంత కట్టుదిట్టాల నడుమ గడవగా తెల్లవారి తలుపులు తెరిస్తే ధ్రువబేరానికి శంఖు చక్రాలు ఆయుధాలుగా కనిపించాయి. దీంతో తిరుమలలో ఉన్నది శ్రీనివాసుడి మూలవిరాట్ మాత్రమే అని అందరూ అంగీకరించారు.
తర్వాతి కాలంలో తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు రామానుజులు ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచారు. ఇదే జియ్యర్ల వ్యవస్థగా పరిణమించి స్థిరపడటంలోనూ రామానుజుల పాత్ర కీలకం. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపజేసింది ఆయనే. ఆ ఆలయం చుట్టూ ప్రాంతాన్ని పూజారులకు అగ్రహారమిచ్చి, వీధుల నిర్మాణం చేపట్టి యాదవరాజు తన గురువైన రామానుజుల పేరిట రామానుజపురంగా రూపకల్పన చేశారు. అదే నేటి తిరుపతి నగరానికి పునాది. శ్రీరంగంలో తన జీవితకాలంలో ఎక్కువభాగం గడిపిన భగవద్రామానుజులు శ్రీరంగనాథుని చేరి తనను రప్పించుకొమని ప్రార్థించి 1137వ సంవత్సరం(ఇది కూడా పింగళ నామ సంవత్సరమే) మాఘశుధ్ధ దశమినాడు పరమపదం చేరారు.
- టిజిఆర్