తానా లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు నాకు ప్రత్యేకం : భారత్ బయోటెక్ కృష్ణ ఎల్ల
తానా మహాసభల మూడో రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తాము ఎంచుకున్న రంగంలో అత్యద్భుతంగా రాణించి, తెలుగు కమ్యూనిటీకి కూడా సేవ చేసిన వారికి ‘తానా డాక్టర్ కాకర్ల సుబ్బారావు లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు’ అందించారు. ఈ అవార్డును భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ ఎల్లకు అందించారు. వ్యాక్సీన్ డెవలప్‌మెంట్ విభాగంలో వారు చేసిన సేవలకు ఈ అవార్డు ఇస్తున్నట్లు తానా ప్రతినిధులు ప్రకటించారు. ముఖ్యంగా కరోనా సమయంలో భారత్ బయోటెక్ ఎంతో సేవ చేసింది. కరోనాను నిలువరించేందుకు కోవ్యాక్సీన్ తయారు చేశారు. ఈ వ్యాక్సీన్‌ను ముందుగా తనే తీసుకున్న కృష్ణ ఎల్ల అందరిలో ధైర్యం నింపారు. ఆయనకు ఈ అవార్డు అందించడం తమకు దక్కిన గౌరవంగా తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి అభివర్ణించారు. ఈ సందర్భంగా న్యూజెర్సీ జనరల్ అసెంబ్లీ, సెనేట్ సంయుక్తంగా చేసిన తీర్మానాన్ని కూడా కృష్ణ ఎల్లకు అందజేయడం జరిగింది.
అనంతరం మాట్లాడిన కృష్ణ ఎల్ల.. ‘నేను కూడా 15 ఏళ్లు అమెరికాలో ఉండి ఆ తర్వాత భారత్‌కు వెళ్లా. ఎన్నో వ్యాక్సీన్లు తయారు చేశాం. కరోనా టైంలో భారత్‌లో చనిపోతున్న ప్రజలను కాపాడాలని, దాని కోసం వేరే దేశాలపై భారత్ ఆధారపడకూడదనే లక్ష్యంతోనే పనిచేశాం. వ్యాక్సీన్ తయారు చేయడానికి ప్రభుత్వం నుంచి ఒక్క పైసా తీసుకోలేదు. సుమారు వెయ్యికోట్లు ఈ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టాం. అంతేకాదు, కరోనాకు నాజల్ వ్యాక్సీన్ తయారు చేసిన తొలి దేశం కూడా భారతే. ఇతర దేశాల నుంచి ఒక్క వ్యాక్సీన్ కూడా భారత్ దిగుమతి చేసుకోలేదంటే మాటలు కాదు. ఈ రోజు నాకు కాకర్ల సుబ్బారావు అవార్డు రావడం నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే అబ్దుల్ కలాం చేతుల మీదుగా మేం తొలి వ్యాక్సీన్ విడుదల చేసినప్పుడు.. కాకర్ల సుబ్బారావ్ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు’ అని ఆయన గుర్తుచేసుకున్నారు.