విజయం కోసం బిజెపి వ్యూహం ఇదే!
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నట్లే రాష్ట్రంలో కూడా తమ ప్రభుత్వం ఉండాలని ఆశపడుతోంది. అందుకు తగ్గట్టే ఎన్నికల్లో పోటీకి ఒంటరిగా దిగింది. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో తమ సత్తాను ప్రదర్శించి చూపాలని అనుకుంటోంది. 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి పెట్టాలని, ముస్లిం మైనార్టీలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని నిర్వహించేందుకు సమాయత్తమైంది. గుజరాత్, కర్నాటక రాష్ట్రాలలో ఏ విధంగా ప్రచారం నిర్వహించామో అదే పంథాలో రాష్ట్రంలోనూ ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్రంలో అధికారంలో ఉండటం భాజపాకు కలిసొచ్చే అంశం. ప్రధాని మోడీతో సహా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రచారంతో తమ పార్టీకి విజయాన్ని చేకూరుస్తుందని దీమాతో ఉన్నారు.
అమిత్‌షా ఇప్పటికే మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, ప్రధాని మోడీ మూడు, నాలుగు చోట్ల బహిరంగ సభలను నిర్వహించేందుకు పార్టీ సమాయత్తమవుతోంది. అమిత్‌షా మరో ఏడు సభలలో పాల్గొంటారని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. వీటికి తోడు ఇతర రాష్ట్రాలకు చెందిన పూర్తిస్థాయి కార్యకర్తలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. స్థానికంగా నాయకత్వ లేమి ఆ పార్టీకి ప్రతికూల అంశాలుగా భావిస్తున్నారు. తెరాసకు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం మొదట్నించీ పాతబస్తీలో ఏడు సీట్లలో గెలుస్తూ వచ్చింది. ఈ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గంపై కన్నేసింది. ఈ నియోజకవర్గంలో అభ్యర్థిని నిలబెట్టడంతో పాటు కారు స్టీరింగ్ తమ చేతుల్లో ఉందంటూ ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారంలో సంచలన ప్రకటన చేశారు. ముస్లిం మైనార్టీలు అత్యధిక సంఖ్యలో ఉన్న ఈ నియోజకవర్గంలో సత్తా చాటేందుకు ఎంఐఎం ప్రయత్నిస్తోంది. హైదరాబాద్ పాతబస్తీ స్థానికతే తమ పార్టీకి బలమని అంటోంది.