బోఇసీలో వైభవంగా శోభకృత్ నామ ఉగాది వేడుకలు
బోఇసీ నగరంలో తెలుగు వారు ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. బోఇసి తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 8న నిర్వహిం చిన శోభకృత్ నామ ఉగాది వేడుకలకు దాదాపు 400 మందికి పైగా తెలుగు ప్రజలు తరలివచ్చి సందడి చేశారు. చిన్నారులు, పెద్దలంతా సంప్ర దాయ వస్త్రధారణతో, వినూత్న కార్యక్రమాలతో అలరించారు. ‘తెలుగు బడి’ పిల్లల పద్యాలు, చక్కటి అన్నమయ్య కీర్తనలు, టాలీవుడ్ పాటలకు నృత్యాలు, తెలుగుతనం ఉట్టిపడే నృత్యమాలిక, మాస్ డ్యాన్స్‌లు, సెమీ క్లాసికల్ డ్యాన్స్‌లతో అదరగొట్టారు. ఈ ఏడాది విశేషంగా కొన్ని పాటలకు పిల్లలే కొరియోగ్రఫీ చేసి అందరూ గర్వపడేలా చేశారు. ఆస్కార్ సొంతం చేసుకున్న తెలుగుపాట నాటు నాటుకు డ్యాన్స్‌తో హాలు దద్దరిల్లింది.
ఉగాది సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమా లు విజయవంతం కావడానికి కృషిచేసిన అందరినీ నిర్వాహకులు జ్ఞాపికలతో సత్కరించారు. క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బోఇసీ తెలుగు సంఘం లక్ష్యాలను ఉపాధ్యక్షుడు అనిల్ కుక్కుట్ల వివరించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను, గొప్పతనాన్ని గుర్తుకు తెచ్చుకుని, మన పిల్లలతో పంచుకోవడమే ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం జరిగిన పరిచయ కార్యక్రమంలో వ్యవస్థాపకులు హరి విన్నమాల, సింహాచలం పిల్ల.. ఈ ఏడాది నూతన అసోసియేషన్ అధ్యక్షులు అనిల్ కుక్కుట్ల, ఉపాధ్యక్షురాలు సింధు మెట్పల్లి, కార్యదర్శి శివ నాగిరెడ్డి ఉయ్యూరు, కోశాధికారి రామ్యా గంటి, మీడియా కార్యదర్శి భార్గవి బండర్ల, సాంస్కృతిక నిర్వాహకులు మైత్రి రెడ్డి, ఈవెంట్ నిర్వాహకులు శశాంక్ వేమూరిలని పరిచయం చేశారు.