ప్రపంచ తెలుగు మహాసభల పర్యవేక్షణకు కేబినెట్ సబ్ కమిటీ
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రధాన వేదికైన ఎల్‌బిస్టేడియం వద్ద సాహిత్యం, సంగీత కార్యక్రమాలతో పాటు ఆహార ప్రదర్శన, అమ్మకాల కేంద్రాలు (పుడ్ కోర్టులు), పుస్తక ప్రదర్శన, హస్తకళల ప్రదర్శన, పురావస్తుశాఖ ప్రదర్శన ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సూచించారు. ఎల్బీస్టేడియం లోపల, బయట అలంకరణలు ఉండాలని ఆదేశించారు. స్డేడియంలో తెలంగాణ సాహితీ మూర్తుల కటౌట్లు ఏర్పాటు చేయాలని మహాసభల ఏర్పాట్లపై ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు.
ఎల్బీస్టేడియంలో ప్రతిరోజూ సాయంత్రం, సాహితీ, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు రవీంద్రభారతి, రవీంద్రభారతి మినీహాలు, రవీంద్రభారతి ప్రివ్యూ థియేటర్, తెలుగు విశ్వవిద్యాలయం, భారతీయ విద్యాభవన్, లలిత కళాతోరణం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, ఎల్‌బి స్టేడియాల్లో సాహిత్య సభలు నిర్వహించాలని సూచించారు. ప్రారంభ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి, ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి వస్తున్నారని, ఈ రెండు కార్యక్రమాలు ఎల్‌బిస్టేడియంలోనే నిర్వహించాలని సూచించారు. అందుకు తగ్గట్టుగా పార్కింగ్, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలన్నారు. మహాసభల సందర్భంగా ఒకరోజు తెలుగు సినీ సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నట్లు కూడా వెల్లడించారు. తెలంగాణ ఆహార్యం, ఆహారం, సంస్కృతి, కళలు, జీవితం, పండుగలు ప్రతిబింబించేలా డాక్యుమెంటరీ కూడా ప్రదర్శించాలని సిఎం ఆదేశించారు.
తెలుగు మహాసభలు నిర్వహించే ఎల్బీస్టేడియంను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. ప్రధాన వేదికతో పాటు మొత్తం ప్రాంగణాన్ని తిరిగి చూశారు. ఎక్కడా ఎలాంటి ఏర్పాట్లు చేయాలో అధికారులకు నిర్దిష్టమైన సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు సునీల్ శర్మ, బుర్రా వెంకటేశం, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ దినకర్‌బాబు, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, కార్యదర్శి నర్సింహారెడ్డి, నగర పోలీస్ కమిషనర్ వివి శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బి ఇఎన్‌సి గణపతి రెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మహాసభల పర్యవేక్షణకు కేబినేట్ సబ్‌కమిటీ
ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో మంత్రులు చందూలాల్, తుమ్మల నాగేశ్వరరావు, కేటీ రామారావులు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర సాహిత్య అకాడమీతో పాటు ఇతర సంస్థలు, అధికారుల సమన్వయంతో ఈ కమిటీ తెలుగు మహాసభల ఏర్పాట్లను పర్యవేక్షించనుంది.