ఇక్కడ పెత్తనం చేయాల్సిన అవసరం నాకు లేదు : చంద్రబాబు
టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని, ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రజాకూటమి అభ్యర్థుల తరపున చంద్రబాబు హైదరాబాద్‌లో రాహుల్‌గాంధీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తనను తిడితే ఓట్లు పడవని హితవుపలికారు. విభజన తర్వాత తెలంగాణను ధనిక రాష్ట్రంగా అప్పగిస్తే ఈ నాలుగున్నరేళ్లలో కేసీఆర్ దుబారా ఖర్ఛుతో అప్పలపాల్జేశారని విమర్శించారు. ప్రజాకూటమి మేనిఫోస్టోను కాఫీ కొట్టారని, ఓటమి భయంతో కేసీఆర్ మూడుసార్లు టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను విడుదల చేశారని ఎద్దేవా చేశారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల అమలుకోసం ప్రధాని మోదీని నిలదీయాల్సిన కేసీఆర్ ఆ పని చేయకపోగా సభలు పెట్టి తనను తిడితే లాభం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ-టీఆర్‌ఎస్ లాలూచీ రాజకీయాలకు ఇది నిదర్శనమన్నారు. కేసీఆర్ నన్ను తిట్టడానికే సమయమంతా కేటాయిస్తున్నారు. పెత్తనానికి వస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఇక్కడ పెత్తనం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఏపీలో నాకు ఎంతో పని ఉంది. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలనేది నా అభిమతం అని అన్నారు. ఎవరు కాదన్నా అవునన్నా హైదరాబాద్‌లో తన ముద్ర అడుగడునా కన్పిస్తుందని అన్నారు.