విశాఖకు ఒక శని పట్టింది... ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ పట్నంలోని పాత గాజువాకలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఏ తప్పు చేయని అచ్చెన్నాయుడుపై కేసు పెట్టారని ఆయనపై కేసు పెడితే జగన్ చేసిన అన్యాయానికి, అవినీతికి జీవితాంతం జైల్లో ఉండాలని, బయట ఉండే అర్హత లేదని అన్నారు. విశాఖ మేయర్‍గా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరావుపై కూడా కేసు పెడతారని, ఇది అరాచకానికి పరాకాష్టని అన్నారు. ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. విశాఖకు ఒక శని పట్టిందని, అది ఏ2 విజయసాయిరెడ్డని, ఆ శనిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని అన్నారు.