అలాంటి వ్యక్తులు రాష్ట్రానికి అవసరమా? : చంద్రబాబు
వైసీపీ అధ్యక్షుడు జగన్, ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ముగ్గురూ కలిసినా ఏమీ జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిస్తామని అన్నారు. అవినీతి పార్టీ వైసీపీ మనపై ఈసీకి ఫిర్యాదు చేసిందని, దీంతో ఎన్నికల పరిధిలో లేని అధికారులను బదిలీ చేసిందని మండిపడ్డారు. జగన్‌కి ఏపీ పోలీసులపై నమ్మకం లేదని, తెలంగాణ పోలీసులపై నమ్మకం ఉందని మండిపడ్డారు. అలాంటప్పుడు జగన్ లోటస్‌పాండ్‌లో ఉండి కేసీఆర్‌కి ఊడిగం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జోలికి ఎవరొచ్చినా గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
యువతకు జాబు కావాలంటే.. బాబు మళ్లీ గెలవాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా ఎంవోయూలు కుదుర్చుకున్నామని తెలిపారు. ఏపీలో పిల్లలందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తనదని సృష్టం చేశారు. జగన్‌పై 31 కేసులు ఉన్నాయని, ఆయనపై సెక్షన్‌లో ఉన్న కేసులన్నీ ఉన్నాయని అన్నారు. ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేయాలంటే అన్నీ చూస్తామని, అలాంటిది నేరచరిత్ర కలిగిన వ్యక్తులు రాష్ట్రానికి అవసరమా? అని ప్రశ్నించారు. ఇంట్లో బాబాయ్‌ని చంపేసి గుండెపోటు అని చెప్పిన జగన్.. ఇక ఎవరినైనా చంపి ఏమైనా చెబుతారని అన్నారు. జగన్ లాంటి నేరస్తులు రాజకీయాల్లో ఉంటే ప్రజల జీవితాలు సర్వనాశనం అయిపోతాయని అన్నారు.