నంద్యాల విషయంలోనే బాబు ఎందుకు భయపడుతున్నారు?
చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికను సవాల్ గా తీసుకుని నిరంతరం అమరావతి నుంచే నడిపిస్తున్నరు. ఆరుగురు మంత్రులు, 25 మంది ఎమ్మెల్యేలను ఇప్పటికే రంగంలోకి దించిన చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నిక ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఉప ఎన్నికలను చూశారు. అవేవీ ఆయనను ఇంత టెన్షన్ పెట్టలేదు. కాని రాష్ట్ర విభజనానంతరం జరుగుతున్న తొలిపోరు నంద్యాల ఉప ఎన్నికనే చెప్పొచ్చు. 2014 ఎన్నికల తర్వాత రెండు ఉప ఎన్నికలు జరిగినా అవి నామమాత్రమే. కాని నంద్యాల అలా కాదు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో వచ్చి పడిన ఎన్నిక ఇది. ఈ ఉప ఎన్నిక ఫలితాన్ని పాలనకు రెఫరెండంగానే భావించాల్సి ఉంటుంది. అందుకోసమే చంద్రబాబు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచే నంద్యాలపై దృష్టి పెట్టారు. అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత రెండు సార్లు నంద్యాల పర్యటనకు వెళ్లి వచ్చిన చంద్రబాబు దాదాపు 1300 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధిపనులను కూడా నంద్యాలకు మంజూరు చేశారు. కాని ఆయనకు ఎక్కడో అనుమానం ఉండటంతోనే నంద్యాల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు టీడీపీ నేతలు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళుతున్నారు స్థానిక నేతలు.
ఎప్పటికప్పుడు సూచనలు….సలహాలు…..
ఇప్పుడు చంద్రబాబు ఏ సమావేశం పెట్టినా ఆయన నోటి నుంచి వచ్చేవి మూడే మాటలు. ఒకటి అమరావతి, రెండు పోలవరం, మూడు నంద్యాల. అలా నంద్యాల ఆయన నోట్లో నిత్యం నానుతూనే ఉంది. ప్రతిరోజూ మంత్రులు, టెలికాన్ఫరెన్స్ లతో నంద్యాల విషయంపై చర్చిస్తూనే ఉన్నారు. తాను నివాసంలో ఉన్నా, సచివాలయంలో ఉన్నా…నంద్యాల నుంచి ఫోన్ అంటే అటెండ్ అయ్యే విధంగా ఏర్పాటు కూడా చేసుకున్నారు ముఖ్యమంత్రి. ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ, ఆ నివేదికలను అధ్యయనం చేస్తూ నంద్యాలలో జరుగుతున్న తప్పులను వెంటనే సరిదిద్దుతున్నారు చంద్రబాబు. గంగుల ప్రతాప్ రెడ్డి, నౌమాన్ వంటి వారి చేరికతో పార్టీ మరింత బలోపేతమయిందని భావిస్తున్నా….నంద్యాల రూరల్ ప్రాంతంలో కొంత నెగిటివ్ రిపోర్ట్ రావడంతో వెంటనే మంత్రులను అలెర్ట్ చేశారు. అలాగే చోటా నేతలు పార్టీలో చేరుతున్నా నేరుగా అమరావతికి రప్పించి తానే స్వయంగా పార్టీ కండువా కప్పుతున్నారు. ఇలా నంద్యాల ఎన్నికల్లో అన్ని వ్యూహాలను చంద్రబాబు అమలుపరుస్తున్నారు.
ఒక పక్క మైండ్ గేమ్ ఆడుతూనే మరొక పక్క తాను చేయాల్సిన సూచనలను పార్టీ నేతలకు చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికను సవాల్ గా తీసుకున్న చంద్రబాబు రేపటి నుంచి రెండు రోజుల పాటు నంద్యాలలోనే పర్యటించనున్నారు. రేపు రాత్రికి నంద్యాలలోనే బసచేసి పోలింగ్ వ్యూహాలను కూడా నేతలకు వివరించనున్నారు. మొత్తం మీద చంద్రబాబు సవాల్ గా తీసుకున్న ఈ ఎన్నికపై నంద్యాల ఓటర్ల తీర్పు ఎలా ఉండనుందోనన్న టెన్షన్ రాష్ట్ర ప్రజలందరిలోనూ ఉంది.