నంద్యాల ఉప ఎన్నిక గెలుపుపై సీఎం చంద్రబాబు స్పందన…
నంద్యాల ప్రజలు అభివృద్ది, సంక్షేమానికి ఓటు వేసి గెలిపించారనీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. గెలుపు తర్వాత ఆయన స్పందించారు. వైసీపీ అధినేత జగన్‌పై కూడా విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా విషయంలో ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పిన జగన్ ఎందుకు తమ ఎంపీలచేత రాజీనామ చేయలేదని ఆరోపించారు.
నాకు ఎన్నికలు కొత్తేమీకాదని అన్నారు. కొత్తగా వచ్చిన వారు కొందరు మాత్రం అటూ ఇటూ పరిగెత్తారని, హడావుడి చేశారని నవ్వులు పూయించారు. చివరికి తామే గెలిచామని అన్నారు. నంద్యాలలో ఈ సారి జరిగినటువంటి రాజకీయాలు తాను ఎన్నడూ చూడలేదని అన్నారు.
రాజశేఖర్ రెడ్డి చనిపోతే తాను విజయమ్మకు ఆ సీటును వదిలేశానని చంద్రబాబు చెప్పారు. కానీ ఇక్కడ జగన్ అలా చేయలేదని అన్నారు. జగన్ మాట్లాడిన మాటలు, చేసుకున్న ప్రచారాన్ని ఓటర్లు గమనించారని అన్నారు. టీడీపీని జగన్ విమర్శించిన పద్ధతి ఆలిండియా స్థాయిలో చర్చనీయాంశం అయిందని అన్నారు. పనిలో పనిగా జగన్‌ను డేరా బాబాతో పోల్చారు.
మంచి సంస్థను పెట్టుకుని, అంతమంది భక్తులను పెట్టుకుని డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ బాబా తన శక్తిసామర్థ్యాలను దుర్వినియోగం చేశాడని అన్నారు. అమ్మాయిల పట్ల ఆ బాబా ప్రవర్తించే తీరు ఎలాంటిదో ఈ రోజు అందరికీ తెలిసిందని చెప్పారు. అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక వ్యక్తి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించవచ్చో చూపిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
జగన్ అసభ్య ప్రవర్తన, అసెంబ్లీని జరగకుండా చేసే తీరు, ఆయన చేస్తోన్న కుట్రలు, కుతంత్రాలు ఎలాంటివో ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు అన్నారు. అందుకే నేను నిన్న ‘ఆయన డేరా బాబా అయితే ఈయన జగన్ బాబా’ అని అన్నానని వ్యాఖ్యానించారు. ‘జాగ్రత్తగా ఉండు సీఎంతో మాట్లాడుతున్నావ్’ అంటూ జగన్ కొన్ని నెలల ముందు అధికారులను బెదిరించారని చంద్రబాబు గుర్తు చేశారు. ఎక్కడికెళ్లినా జగన్ ఇటువంటి వ్యాఖ్యలే చేస్తున్నారని బాబు అన్నారు.