జగన్ పార్టీ బలం అదే, తాటతీస్తాం: నంద్యాలలో ఏకేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే వారసులకు టికెట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని, కానీ, విపక్షమైన వైసీపీ ఆ సంప్రదాయాన్ని పాటించడం లేదని ధ్వజమెత్తారు. శనివారం నంద్యాలలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు.
నంద్యాల అభివృద్ధి కోసమే భూమా నాగిరెడ్డి టీడీపీలోకి వచ్చారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని పదేపదే కోరారని చంద్రబాబు గుర్తు చేశారు. అభివృద్ధిపై మా చిత్తశుద్ధిని చూపాలనే నంద్యాలపై దృష్టిపెట్టామని, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామని సీఎం ప్రకటించారు.
రూపురేఖలు మారుస్తాం..
ఎన్నికల కోసం అభివృద్ధి పనులు చేయడం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. హేతుబద్ధతలేని విభజనతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, ఆర్థికలోటు ఉన్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. రాయలసీమ ప్రాంతాన్ని రతనాల సీమ చేయడంతోపాటు నంద్యాల పట్టణం రూపురేఖలు మారుస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని, దేశంలో ఎక్కడాలేని విధంగా నదుల అనుసంధానం చేశామని చంద్రబాబు అన్నారు.
తాటతీస్తాం..
ప్రజలు సహకరించడం వల్లే విశాఖను అభివృద్ధి చేయగలిగామని, నంద్యాల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని, రోడ్ల విస్తరణ పనులకు ప్రజలు సహకరించడం సంతోషమని, కేటగిరీల వారీగా బాధితులకు పరిహారం అందిస్తామని చంద్రబాబు తెలిపారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. జర్నలిస్టులకు మూడు పడకల ఇళ్లు కట్టిస్తామని చంద్రబాబు అన్నారు. ఎవరైనా బెల్టుషాపు నిర్వహిస్తే తాట తీస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ అభ్యర్థి అభివృద్ధిని కాకుండా రాజకీయం కోరుకున్నాడని చంద్రబాబు విమర్శించారు.
జగన్ పార్టీ బలం అదే
తన బలం ప్రజాబలం అని, జగన్ పార్టీది అవినీతి డబ్బు బలమని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇసుక దందా చేసే వారిని వదలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. కుప్పం కంటే నంద్యాల అభివృద్ధికి ఎక్కువ నిధులు ఇచ్చామని బాబు స్పష్టం చేశారు. నంద్యాలలో కొందరు ముస్లింలపై అనవసరంగా కేసులు పెట్టించారని... వాటిపై చట్టప్రకారం సహాయం చేస్తామని చంద్రబాబు చెప్పారు.
అభివృద్ధి పనులు
నంద్యాలలో మురుగునీరు శుద్ధికి రూ.90 కోట్లు మంజూరు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నంద్యాలలో రేపటి నుంచి 13వేల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. నంద్యాలకు మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ కాలేజీ మంజూరు చేయనున్నారు. నంద్యాలలో త్వరలోనే అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. చామకాలువ సుందరీకరణ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. కుందూ, గాలేరు నగరి, మద్దిలేరును సుందర ప్రదేశంగా తీర్చిదిద్దుతామన్నారు. 50 ఏళ్లు దాటిన బీడీ కార్మికులకు రూ.1000 పెన్షన్ ఇస్తామని సీఎం తెలిపారు. 7వ తరగతి ఫెయిలైన వారికి డ్రైవింగ్ లైసెన్సులు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.