చంద్రబాబుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఎన్నారైలు
అమెరికా పర్యటనకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎన్నారైలు ఘనస్వాగతం పలికారు. న్యూయార్క్ జే.ఎఫ్ .కె. ఎయిర్ పోర్టుకు చంద్రబాబు చేరుకుంటున్నారనే సమాచారంతోనే వందలమంది న్యూయార్క్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. ఎపి ఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు రవి వేమూరి, ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి, తానా అధ్యక్షుడు సతీష్ వేమన, ప్రెసిడెంట్ ఎలక్ట్ జే తాళ్ళూరి, నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ, కలపటపు బుచ్చి రామ్ ప్రసాద్ తదితర ప్రముఖులతో పాటు ఎన్నారై టీడీపి నాయకులు చాలామంది ఎయిర్ పోర్టుకు చేరుకుని చంద్రబాబుకు పుష్ఫగుచ్చాలు ఇచ్చి సాదర స్వాగతం పలికారు.
నెవార్క్ లోని ఎన్ జె ఐ టి వెల్నెస్ ఈవెంట్స్ సెంటర్ లో ముఖ్యమంత్రితో జరిగిన మీట్ అండ్ గ్రీట్ సమావేశానికి దాదాపు 4 వేలకు పైగా అభిమానులు కుటుంబ సమేతంగా తరలి వచ్చారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత మావోల దాడిలో మతిచెందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణలకు సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం, దీప ప్రజ్వలన చేసి ఎన్ టి ఆర్ విగ్రహావిష్కరణ చేశారు. వేదికపై చంద్రబాబుతోపాటు రవి వేమూరి, జయరాం కోమటి, మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, ఎంపి సిఎం రమేష్, వరదాపురం సూరి, సతీష్ వేమన, జే తాళ్లూరి, మోహన కృష్ణ మన్నవ, బుచ్చి రామ్ ప్రసాద్ కూర్చున్నారు.