ఆయన ఫిర్యాదు ఆధారంగా బదిలీ చేస్తారా? : చంద్రబాబు
ముగ్గురు ఐపీఎస్‌లను ఏ కారణంతో బదిలీ చేశారో సమాధానం చెప్పలేకపోతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కర్నూలులో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఆర్థిక నేరస్తుడు విజయసాయిరెడ్డి ఫిర్యాదు ఆధారంగా బదిలీ చేస్తారా? అని ప్రశ్నించారు. ఏ కారణం లేకుండా అధికారులను బదిలీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీజేపీ, వైసీపీ, కేసీఆర్ ఆడిన నాటకాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలతో సంబంధంలేని అధికారులను ఎలా బదిలీ చేస్తారు? అని ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్‌లోనే వాళ్ల నేరాలపై ప్రస్తావించారు. నేరాలున్న వారు ఫిర్యాదు చేస్తే ఎలా పరిగణనలోకి తీసుకుంటారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ఒక రాజకీయ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూడడం మంచిది కాదు అని అన్నారు.
ఓట్ల దొంగలు పట్టుబడిన తర్వాత ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకుని వైకాపా ఆరాచకాలు చేయాలని చూస్తోంది. వివేకా హత్య వాళ్ల ఇంట్లో జరిగితే సాక్ష్యాలన్నీ తారుమారు చేశారు. హత్యకేసు విచారణ జరుగుతుంటే అధికారిని ఎలా బదిలీ చేస్తారు? కులాలు, మతాలు పేరుతో ఫిర్యాదు చేస్తే బదిలీ చేస్తారా? ఆగమేఘాలపై బదిలీలపై నిర్ణయం తీసుకుంటారు గానీ.. దొంగ ఓట్లపై నిర్ణయం తీసుకోరా? ఫారం-7 దరఖాస్తులు దుర్వినియోగం చేస్తున్నారని పట్టిస్తే చర్యలు తీసుకోరా? చంద్రబాబు ప్రశ్నించారు.