ఆయన వస్తే అమరావతి ఆగిపోతుంది : చంద్రబాబు
జగన్ అధికారంలోకి వస్తే అమరావతి అభివృద్ది ఆగిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ వస్తే అమరావతిలో ఎవరూ పెట్టుబడులు పెట్టరన్నారు. జగన్‌ను చూస్తే పారిశ్రామిక వేత్తలు పారిపోతారని విమర్శించారు. కేసీఆర్‌తో జగన్ కలవడం క్షమించరాని నేరమని చెప్పారు. మనల్ని దున్నపోతులు.. కుక్కలు అన్నారని.. ఆంధ్రావారిని చీకొట్టారని కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. అలాంటి వారితో జగన్ కలిసివెళ్తున్నారని ఆరోపించారు. ఏపీకి అన్యాయం చేస్తున్న వ్యక్తి కేసీఆర్ అని వివరించారు. బంగారు బాతు లాంటి హైదరాబాద్‌ను అనుభవిస్తూ కేసీఆర్ మనల్ని తిడుతున్నారని మండిపడ్డారు. కేసుల కోసం కేసీఆర్‌తో జగన్ రాజీపడ్డారన్నారు. సొంత బాబాయి హత్యకు గురైతే గుండెపోటు అని డ్రామాలాడారంటూ ధ్వజమెత్తారు.
అయినా మనపై తెలంగాణ పెత్తనం ఏంటి? మీకు రోషం ఉందా లేదా? మోదీ మోసం చేశాడా లేదా? అని ప్రశ్నించారు. మోదీ మనపై దాడులు చేయిస్తున్నాడని మండిపడ్డారు. మోదీకి ఇవే చివరి ఎన్నికలు అని హెచ్చరించారు. మాపై దాడులు చేసి మీరు గెలవలేరన్నారు. రాష్ట్రానికి ప్రజలు కవచంలా ఉండాలని విజప్థి చేశారు.