ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై క్వాల్ కమ్ టెక్నాలజీస్ ఆసక్తి
ముఖ్యమంత్రితో క్వాల్‌కమ్ టెక్నాలజీస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గోపి సిరినేని, డైరెక్టర్ ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ చందన పైరాల సమావేశం అయ్యారు. టెలికమ్యూనికేషన్స్ రంగంలో ప్రఖ్యాతి గాంచిన క్వాల్‌కమ్ టెక్నాలజీస్ రాష్ట్రంలో చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ఆసక్తి కనబరిచింది. ప్రాజెక్టు విజయంలో భాగస్వాములు అవ్వాలన్న ఆకాంక్షను సంస్థ ప్రతినిధులు వ్యక్త పరిచారు. ముందుగా ప్రాజెక్టును అధ్యయనం చేసి ఏయే అంశాల్లో సహకరించగలరో పరిశీలించి చెప్పాలని గోపి సిరినేనికి ముఖ్యమంత్రి సూచించారు. డ్రైవర్ లేని కార్లు, డ్రోన్ల ద్వారా గృహావసరాలకు వివిధ ఉత్పత్తుల సరఫరా చేసే ప్రదర్శనను ముఖ్యమంత్రి తిలకించారు. అనంతరం స్ట్రాటోస్పియర్ బెలూన్స్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించే విభాగాధిపతి అలిస్టర్‌తో సమావేశమయ్యారు.
లాస్‌ఏంజెల్స్‌లో టెస్లా ప్రెసిడెంట్ సీఎఫ్ఓ ఎలొన్ మస్క్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు. అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి గుట్టుపల్లి సాయిప్రసాద్, ఆర్థిక అభివృద్ధి మండలి కార్యనిర్వాహక అధికారి జాస్తి కృష్ణకిశోర్, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఐటీ ముఖ్య కార్యదర్శి కావేటి విజయానంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సోల్మన్ ఆరోఖ్యరాజ్ వున్నారు.