ASBL Koncept Ambience

'పాఠశాల' ఆన్ లైన్ కోర్స్ ను ప్రారంభించిన చంద్రబాబు

'పాఠశాల' ఆన్ లైన్ కోర్స్ ను ప్రారంభించిన చంద్రబాబు

మన మాతృభాష తెలుగును మన చిన్నారులకు నేర్పించే బాధ్యతను ప్రతి ఎన్నారై తెలుగు కుటుంబం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఇంట్లో కూడా తెలుగులోనే మాట్లాడటం ద్వారా వారికి మాతృభాషపై మమకారం కలిగేలా చూడాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ వారు 'పాఠశాల' ద్వారా ప్రవేశపెట్టిన తెలుగు పలుకు కోర్స్‌ ఆన్‌లైన్‌ వర్షన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించి ప్రసంగించారు. అమెరికాలోని చిన్నారులకు తెలుగును నేర్పిస్తున్న 'పాఠశాల'ను ఆయన అభినందించి ఇప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా కూడా తెలుగు బోధనను చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. ఇందువల్ల మరింతమందికి తెలుగు భాషను నేర్చుకునే సౌకర్యం కలిగిందన్నారు. ఎపి ప్రభుత్వం అందిస్తున్న తెలుగు పలుకు కోర్సును ప్రపంచంలోని తెలుగు వాళ్ళంతా నేర్చుకోవాలని కోరారు.

పాఠశాల చైర్మన్‌ జయరామ్‌ కోమటి మాట్లాడుతూ, అమెరికాలో గత నాలుగేళ్ళుగా చిన్నారులకు తెలుగు భాషను 'పాఠశాల' నేర్పిస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఎపి ప్రభుత్వంతో కలిసి తెలుగు పలుకు కోర్స్‌ను చిన్నారులకు నేర్పిస్తున్నట్లు చెప్పారు. పాఠశాల వైస్‌ చైర్మన్‌ ప్రసాద్‌ గారపాటి మాట్లాడుతూ, పాఠశాల ఇప్పుడు నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ గుర్తింపును కూడా కలిగి ఉందని చెప్పారు. ప్రపంచంలోని ఎన్‌ఆర్‌ తెలుగు కమ్యూనిటీకి తెలుగు భాషను బోధించడమే తమ లక్ష్యమని చెప్పారు.

పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, నేటి తరం చిన్నారులు సులభంగా తెలుగును నేర్చుకునేలా కొత్త సిలబస్‌తో అచ్చుపుస్తకాలను తయారు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త సిలబస్‌ ప్రకారం ఇ-లెర్నింగ్‌ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నామని చెప్పారు. తెలుగు భాషను క్రమపద్ధతిలో నేర్పించడంతోపాటు శాస్త్రీయంగా అక్షరాలను అభ్యసించేలా బోధన ఉంటుందని చెప్పారు. Learning - Speaking - Reading- Writing పద్ధతిలో మా బోధన ఉంటుందని చెప్పారు. తొలుత భాషను తెలుసుకోవడం, తరువాత మాట్లాడటం, చదవడం, రాయడం వంటివి చేయిస్తామని తెలిపారు. Forsys Inc  కంపెనీ ప్రస్తుతం పాఠశాలకు టెక్నాలజీ పార్టనర్‌గా వ్యవహరిస్తోందని, ఆన్‌లైన్‌ కోర్సుల నిర్వహణ వ్యవహరాలను చూస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడ్వయిజరీ బోర్డ్‌ సభ్యురాలు విజయ ఆసూరి కూడా పాల్గొన్నారు.


Click here for Photogallery

 

Tags :