అమరావతి మహా కలశయాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ తమిళనాడు విభాగం రూపొందించిన అమరావతి మహాకలశ యాత్ర పోస్టర్‌ను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాంపు ఆఫీసులో ఆవిష్కరించారు. తమిళనాడు టిడిపి గ్రేటర్ చెన్నయ్ అడహాక్ కమిటీ కన్వీనర్ డి.చంద్రశేఖర్ తమిళనాడులో పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని చంద్రబాబు అభినందించారు. తమిళనాడులో తెలుగుభాషను ద్వితీయ బోధన భాషగా కొనసాగించాలని తాను ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రికి లేఖరాశానని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.
అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ తమిళనాడు నుంచి ఈ నెల 18న తమ ఆధ్వర్యంలో 120మంది కార్యకర్తలతో మహాకలశ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ నెల 18న తేదీన తంజావూరులో ప్రారంభమయ్యే యాత్ర 21నాటికి అమరావతికి చేరుతుందన్నారు. ముఖ్యమంత్రికి నీటి కలశాలను, పవిత్రమైన పుడమితల్లి మట్టిని అందజేస్తామన్నారు. 22న శంకుస్థాపన తర్వాత జరిగే సభలో తాము పాల్గొంటామని తెలిపారు. రాజధాని నగరానికి, ఆంధ్రప్రదేశ్ తెలుగువారికి సంఘీభావంగా ఈ మహాకలశయాత్ర తలపెట్టామని అన్నారు. తమిళనాడులోని తంజావూరు, తిరుచ్చిలో, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా నాయుడుపేట, నెల్లూరు, ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో రోడ్డు షో నిర్వహించనున్నట్లు తెలిపారు. రోడ్డు షోలలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆవశ్యకత, చంద్రబాబు ఆధ్వర్యంలో రాజధాని నిర్మాణానికి సాగుతున్న కృషిని వివరిస్తామన్నారు. ఎన్నారై తెలుగుదేశం నేత విజయ్ పోస్టరు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.