మా పోరాటం వైసీపీతో కాదు... టీఆర్ఎస్ తోనే
ఈ ఎన్నికల్లో మా పోరాటం వైసీపీతో కాదు. టీఆర్‌ఎస్‌తోనే. ఖబడ్దార్ కేసీఆర్ జాగ్రత్తగా ఉండు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కేసీఆర్ మా పాలనను చూడు. మా పౌరుషాన్ని చూడు అని సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు, శ్రీకాళహస్తి, తిరుపతి, కడప జిల్లా బద్వేలు, రాయచోటిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. హైదరాబాద్ టీడీపీ సేవామిత్ర యాప్ సమాచారాన్ని దొంగలించిన కేసీఆర్ దానిని జగన్‌కు ఇచ్చాడని ఆరోపించారు. జన్మభూమికి ద్రోహం చేసిన వైసీపీ ఈ గడ్డపై ఉండటానికి వీల్లేదన్నారు. 2014లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పినట్లే ఈసారి వైసీపీకి చెప్పాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రానికి జగన్ ఉన్నాదం పెద్ద సమస్యగా మారిందని ధ్వజమెత్తారు. పోలవరంపై కోర్టుకెళడం, రాజధాని నిర్మాణానికి అడ్డుపడడం వంటి చర్యలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. కోడికత్తి డ్రామా ఎంత రక్తి కట్టించారో అందరికీ తెలుసునని ఎద్దేవాచేశారు. పనికికాని జగన్ చానల్, పత్రిక వివేకా గుండెపోటుతో మృతి అని వేశాయని గుర్తు చేశారు. హత్య అని నిర్థారణ అయిన తర్వాత తన పైనా, మంత్రి ఆదినారాయణ రెడ్డిపైనా ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు.