నవ్యాంధ్రకు పెట్టుబడులే లక్ష్యంగా... ముఖ్యమంత్రి అమెరికా పర్యటన
ఆంధ్రప్రదేశ్‌ను అన్నీరంగాల్లో అభివృద్ధిపరిచేందుకు అవసరమైన పెట్టుబడులకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికాలో మే 4 నుంచి 11వరకు పర్యటిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రితోపాటు ఇద్దరు మంత్రులు, మరికొంతమంది అధికారులు పాల్గొంటున్నారని తెలిపారు. ప్రవాస భారతీయులు, విదేశాంధ్రులు, ఇతర తెలుగువాళ్ళను ముఖ్యమంత్రి కలుసుకుంటారని, అమెరికా పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారని ఆయన వివరించారు. యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ యాన్యువల్ వెస్ట్‌కోస్ట్ సమ్మిట్ 2017లో ముఖ్యమంత్రి పాల్గొంటారని, ఇందులోనే ట్రాన్స్‌పోర్మేటివ్ సిఎం అవార్డును కూడా చంద్రబాబు స్వీకరిస్తారని పరకాల తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటనలో ప్రధానంగా మూడు రాష్ట్రాలతో సిస్టర్ స్టేట్ ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్లు చెప్పారు. కాలిఫోర్నియా, అయెవా, ఇల్లినాయిస్‌లతో ఆంధ్రప్రదేశ్ స్నేహపూర్వక సోదర రాష్ట్ర సంబంధాలపై అవగాహన ఒప్పందాలు చేసుకోబోతున్నట్లు తెలిపారు. పిన్‌టెక్ రంగంలో ఇల్లినాయిస్, టెక్నాలజీలో కాలిఫోర్నియా, వ్యవసాయంలో అయోవా రాష్ట్రాలు అగ్రగామిగా ఉన్నాయని, ఆయా రాష్ట్రాలతో సిస్టర్ స్టేట్ అగ్రిమెంట్ చేసుకోవడంవల్ల రాష్ట్రంలో ఆయా రంగాల అభివృద్ధికి ఈ రాష్ట్రాలు తోడ్పాటును ఇస్తాయని చెప్పారు. 4న కాలిఫోర్నియా స్టేట్‌తో ఎంఓయు, గ్లోబల్ క్లైమేట్ లీడర్‌షిప్ అనే అంశంపై కాలిఫోర్నియా, ఎపి మధ్య మరో ఎంఓయు ఉంటుందన్నారు. 7న అయోవా స్టేట్‌తో సిస్టర్ స్టేట్ అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా వ్యవసాయ రంగంలో అయోవా విశ్వవిద్యాలయం మనకు సహకారాన్ని అందజేస్తుందన్నారు.
దాదాపు 300 మంది అగ్రశ్రేణి సిఇఓలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. ఐటీ, ఫిన్‌టెక్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి రంగాల్లో దిగ్గజాలుగా ఉన్న సంస్థల సిఇఓలతో అనేక వేదికలపై ఆయన సమావేశమవుతారు. 30-35 మందితో ద్వైపాక్షిక చర్చలు కూడా జరపనున్నారు.
కాలిఫోర్నియాలో జరిగే అమెరికా, భారత వాణిజ్య మండలి (యుఎస్‌ఐబిసి) సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనడంతోపాటు మే 8న ఇచ్చే ట్రాన్స్‌ఫర్మేటివ్ చీఫ్ మినిష్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకోనున్నారు. సిస్కో సంస్థ అధినేత జాన్ ఛాంబర్స్ నివాసంలో జరిగే విందులో ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు. ఈ విందులో టిమ్ కుక్, సుందర్ పిచాయ్‌లతోపాటు ఫేస్‌బుక్, ఒరాకిల్, ట్విట్టర్ వంటి దిగ్గజ సంస్థల సిఇఓలు కూడా పాల్గొంటారు. ఒరాకిల్, ఆపిల్, టెస్లా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరపడంతోపాటు వారి పరిశ్రమలను, కార్యాలయాలను కూడా ముఖ్యమంత్రి సందర్శిస్తారని ప్రభాకర్ తెలియజేశారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీని, అయోవా యూనివర్సిటీలోని విత్తనాభివృద్ధి కేంద్రాన్ని కూడా ముఖ్యమంత్రి బృందం సందర్శించనున్నది.
నార్త్ టెక్సాస్, డల్లాస్, అర్లింగ్టన్ యూనివర్సిటీల ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశమవుతారు. ఆంధ్ర వారి నుంచి ఏమి ఆశిస్తోంది., వారు ఏమి చేయగలరు అన్న విషయాలతోపాటు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వారి భాగస్వామ్యం ఉంటే ఎలా ఉంటుందన్న విషయాలపై కూడా ఈ పర్యటనలో చర్చిస్తారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్ పలువురు అధికారులు వెళ్ళనున్నారు.