ఎపి జన్మభూమి కార్యక్రమాలు భేష్ అన్న చంద్రబాబు
మాతృరాష్ట్రంలోని గ్రామాలతో మీరు కనెక్ట్ అవడమే జన్మభూమి కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నారైలను ఉద్దేశించి చెప్పారు. కాలిఫోర్నియాలోని శాన్‌హోసెలో ఉన్న ఎపి జన్మభూమి కార్యాలయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నారైలు ఇచ్చే విరాళాలకన్నా వారిని గ్రామాలకు కనెక్ట్ చేయడం ముఖ్యమని చెప్పారు. మీరు అమెరికా వచ్చి కష్టపడి మంచి ఆదాయాన్ని గడించడంతోపాటు సౌకర్యవంతమైన జీవనాన్ని గడుపుతున్నారని అంటూ, మిమ్మల్ని చూసి గ్రామాలు అసూయపడేలా కాకుండా, గ్రామాలతో కనెక్ట్ అవడంతోపాటు వారికి మీరు ఏదోవిధంగా సాయపడితే వారు మిమ్మల్ని ఆప్తుడిగా చూసుకుంటారని చెప్పారు. ఫైబర్ గ్రిడ్ నెట్ వర్క్ ద్వారా రాష్ట్రం, గ్రామాల్లోని ప్రతి ఇల్లు ఇంటర్నెట్ కనెక్షన్ పొందుతాయని, అప్పుడు మీరు ఇక్కడ నుంచే మీ కుటుంబంతో, మీ గ్రామాల్లోని వారితో సంభాషించవచ్చని చెప్పారు. ఇండియా ఇప్పుడు వేగంగా అభివృద్ధిని అందుకుంటోందని చెప్పారు. సోలార్ విద్యుత్ కారణంగా విద్యుత్ ఖర్చులు తగ్గాయని చెప్పారు. ప్రపంచంలోనే ఇప్పుడు చవకగా మీరు విద్యుత్‌ను భారత్‌లో అందుకోవచ్చని తెలిపారు. ఎపి జన్మభూమి వ్యవహారాలను చూస్తున్న ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అంటూ, ఆయన,ఆయనతోపాటు ఉన్న జన్మభూమి కో ఆర్డినేటర్‌లు చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు.
ఎపి జన్మభూమి కార్యాలయం ద్వారా గత 14 నెలలుగా చేస్తున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఎన్నారైలను మాతృరాష్ట్రానికి ఎలా కనెక్ట్ చేస్తున్నది తెలియజేయడంతోపాటు వారు ఇచ్చిన విరాళాల ద్వారా మాతృరాష్ట్రంలో చేపట్టిన, చేపడుతున్న కార్యక్రమ వివరాలను తెలిపారు. ఎపి ప్రభుత్వ స్కూళ్ళలో డిజిటల్ క్లాస్‌రూమ్‌ల ఏర్పాటు, అంగన్‌వాడీ కేంద్రాల భవనాల ఏర్పాటు, శ్మశానవాటికల అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుని, ఇందులో ఎన్నారైలను భాగస్వాములను చేస్తున్నట్లు చెప్పారు. ఇంతవరకు దాదాపు 1500 స్కూళ్ళలో డిజిటల్ తరగతులను ఎన్నారైలు ఇచ్చిన విరాళాలతో ప్రారంభించినట్లు తెలిపారు. 100 అంగన్‌వాడీ కేంద్రాలు, 35 శ్మశానవాటికలను అభివృద్ధి చేస్త్నుట్లు తెలియజేశారు. ఎన్నారై కనెక్ట్ కార్యక్రమం ద్వారా ఎన్నారైలు ఇప్పుడు ముఖాముఖీగా పాఠశాల విద్యార్థులతో, టీచర్లతో సంభాషిస్తున్నారని చెప్పారు.
తొలుత జన్మభూమి కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి జయరామ్ కోమటి ఘనంగా స్వాగతం పలికారు. జన్మభూమి వలంటీర్లు అమెరికాలో ఇతర చోట్ల జన్మభూమి వలంటీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సంభాషించారు. పైలా ప్రసాద్, పైలా జోగినాయుడు, కృష్ణ గంప, రజనీకాంత్ కాకర్లతోపాటు సుభాష్, జేపి వేజెళ్ళ, లావణ్య దువ్వి, వెంకట్ కోగంటి, ఎన్నారై టీడిపి, తానా, బాటాకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి వచ్చారు.